మీ కష్టం వృధాగా పోదు తాత.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది!

మీ కష్టం వృధాగా పోదు తాత.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది!
ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇందులో ఓ కుమారుడు పనికోసం బయటకు వెళ్లి ఓ వారం రోజుల తర్వాత శవమై కనిపించాడు.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ తాత పేరు దేస్రాజ్.. ముంబైలో ఉంటాడు. ఇద్దరు కొడుకులే.. వాళ్ళని పెంచి పెద్ద చేసిండు.. వాళ్ళ కాళ్ల మీదా వాళ్ళు నిలబడేలా చేశాడు. వారికి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. ఇక మనవలు, మనవరాళ్లతో ఈ కాలం హయగా గడపాలని అనుకున్నాడు. కానీ అన్ని మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది చెప్పండి.

ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇందులో ఓ కుమారుడు పనికోసం బయటకు వెళ్లి ఓ వారం రోజుల తర్వాత శవమై కనిపించాడు. కుడి భుజం పోయినట్టుగా అనిపించింది దేస్రాజ్‌కు. తాను బాధపడుతూ కూర్చుంటే తన కుటుంబ సభ్యుల ఆకలి తీరదు కదా.. ఆ బాధనంతా దిగమింగుకొని మరుసటి రోజే ఆటో నడపడానికి వెళ్లాడు. కోడళ్లు, వారి పిల్లల బాధ్యత తనమీద వేసుకున్నాడు.

అయితే ఆ బాధ నుంచి కోలుకోకముందే దేస్రాజ్‌కు మరో విషాదాన్ని మిగిల్చింది కాలం. ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తరవాత మిగిలిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు కొడుకులను కోల్పోయేసరికి ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పుడు కుటుంబం మొతాన్ని తన భుజంపైన వేసుకున్నాడు ఆ పెద్దాయన..

ఆ వయసులో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషంచడం మొదలు పెట్టాడు. అయితే తాత కష్టాన్ని దగ్గరి నుంచి చూసిన దేస్రాజ్‌ మనవరాలు విలవిల్లాడిపోయి.. తానూ చదువు మానేసి ఏదైనా పని చేస్తానని చెప్పింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న తన మనవరాలు చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని మరింతగా కష్టపడడం మొదలు పెట్టాడు దేస్రాజ్‌.

ఆటో పట్టుకొని పొద్దున ఆరు గంటలకు బయటకు వెళ్తే.. రాత్రి పదింటికి తిరిగి వచ్చేవాడు. అలా నెలకు రూ. 10 వేలు సంపాదించేవాడు. ఇందులో రూ.6 వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే... మిగతా డబ్బును కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు. తాత కష్టాన్ని ఆ మనవరాలు వమ్ము చేయలేదు. తాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ఇంటర్‌లో 80 శాతం మార్కులు సాధించింది. ఈ విషయం ఆటో ఎక్కిన వాళ్ళందరికీ చెప్పుకొని తెగ సంతోషపడ్డాడు ఆ పెద్దాయన.

ఇక ఆ తర్వాత మనవరాలు బీఈడీ చదువుతానని, ఢిల్లీకి వెళ్తానని చెప్పింది. ఢిల్లీ అంటే మామలు మాటలు కాదు కదా.. పైసలతో కూడుకున్న పని.. ఆమె చదువు కోసం తమకున్న ఒకే ఒక్క ఆస్తి ఇంటిని కూడా అమ్మేశాడు. తన భార్య, కోడళ్లు, ఇతర మనవలు, మనవరాళ్లను బంధువుల ఊరికి పంపించి వారు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశాడు. అలా ఇంటిని అమ్మేసిన డబ్బుతో మనవరాలుని చదివిస్తున్నాడు. ఇక అప్పటినుంచి ఆటో నడుపుతూ అందులోనే తింటూ, ఆటోలోనే నిద్రపోతూ కాలం గడుపుతున్నాడు.

తన మనవరాలు తప్పకుండా టీచర్ అవుతుందని, తనని గర్వపడేలా చేస్తుందని ఆ తాత చెపుతున్నాడు. అయితే దేస్రాజ్‌ కథను హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే గురువారం తన ఫేస్‌బుక్‌ పేజిలో షేర్‌ చేసింది. ఈ కథను చదివిన వాళ్ళందరూ తాత నీ గురించి చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆర్ధిక సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు.

అయితే ఈ స్టోరి కాంగ్రెస్‌ నాయకురాలు అర్చనా దాల్మియాను బాగా కదిలించింది. ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో దేస్రాజ్‌ ఆటో నంబర్‌, మొబైల్‌ నంబర్‌, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్‌ చేశారు. మనం ఆయనకు సాయం చేయాలి.. దయచేసి ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story