ట్రాఫిక్ జామ్‌లో వడాపావ్‌ల విక్రయం.. నెలకు రూ.2 లక్షల ఆదాయం

ట్రాఫిక్ జామ్‌లో వడాపావ్‌ల విక్రయం.. నెలకు రూ.2 లక్షల ఆదాయం
అలా మూడు గంటల సమయం ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు అతడికి ఓ ఐడియా వచ్చింది. అందరూ ఇళ్లకు వెళ్లే సమయం ఆకలితో ఉంటారు

నెలకు రూ.35వేల జీతం వచ్చే ఉద్యోగం మానేసి ఆ వడాపావులు అమ్మి ఏంత సంపాదిస్తావు అని అమ్మ వారించింది. కానీ కొడుకు పట్టుదల చూసి తాను ఓ చెయ్యి వేసింది. అమ్మ ఆశీర్వాదం, అతడి సంకల్పబలంతో ఇప్పుడు నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆరుగురు వర్కర్లను తన చేతికింద పెట్టుకుని వారికీ ఉపాధి కల్పిస్తున్నాడు థానేకు చెందిన గౌరవ్.

2009 లో, థానేలో నివసించే గౌరవ్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం 5.30-6 గంటలకు అంధేరి వద్ద తన షిఫ్ట్ పూర్తి చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి 24 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ ట్రాఫిక్ జామ్ అయింది. కడుపులో ఆకలిగా ఉంది. రోడ్డు పక్కనుంచి వేయించిన పల్లీల వాసన వస్తోంది. అంతలో ఓ కుర్రాడు పల్లీల పొట్లం తీసుకుని గౌరవ్‌ని సమీపించాడు. వెంటనే అతడు పల్లీలు కొనుక్కుని తింటూ కొంత సమయాన్ని గడిపాడు.

అలా మూడు గంటల సమయం ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు అతడికి ఓ ఐడియా వచ్చింది. అందరూ ఇళ్లకు వెళ్లే సమయం ఆకలితో ఉంటారు. దానికి తోడు ఈ ట్రాఫిక్ జామ్ ఉంటే ఎక్కడ లేని చిరాకు, విసుగు వస్తుంది. కడుపులో ఏదన్నా పడితే ఆకలైనా తీరుతుందని అనిపించింది. అప్పుడే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వారికి వడాపావ్ అందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చి అమ్మకు చెప్పాడు ఉద్యోగం మానేసి వడాపావ్ బండి పెడతానని. ఆమె మొదట భయపడింది. వడాపావ్‌లు విక్రయించే వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంక నువ్వేం చేస్తావు అంది. అయినా అమ్మని ఒప్పించాడు.

'ట్రాఫిక్' పేరుతో వడా పావ్‌ సెంటర్ ఓపెన్ చేశాడు. ఇందులో గౌరవ్ తాజాగా, పరిశుభ్రమైన వాతావరణంలో చక్కగా ప్యాక్ చేసిన వడా పావ్స్‌ను ఒక చిన్న వాటర్ బాటిల్ మరియు టిష్యూ పేపర్‌తో ఒక పెట్టెలో పెట్టి రూ.20 విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. నగరంలో సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు 'ట్రాఫిక్' పనిచేస్తుంది. మొదటి వారం రోజులు విక్రయాలు సరిగా లేవు. అయినా నిరాశ చెందక ప్రయత్నించాడు. వారం రోజుల అనంతరం వడాపావ్ విక్రయాలు జోరందుకున్నాయి. అమ్మ శుచిగా చేస్తుంటే, భార్య వాటిని నీట్‌గా ప్యాక్ చేసింది. వాటిని తీసుకెళ్లి గౌరవ్ విక్రయించేవాడు. అలా మొదట రోజుకి 100 వడాపావ్‌లతో ప్రారంభించిన అతడి వ్యాపారం ఇప్పుడు రోజుకి 800 వడపావ్‌లు తయారు చేసి విక్రయించే స్థాయికి ఎదిగాడు. అతడి సంపాదన ఇప్పుడు నెలకు 2 లక్షలు.

అతని 52 ఏళ్ల తల్లి రంజనా, కొడుకు ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న తరువాత కలత చెందానని చెప్పారు. "గౌరవ్‌కు స్థిరమైన ఉద్యోగం ఉంది. మేనేజర్‌గా పదోన్నతిని కూడా పొందాడు. నెలకు రూ .35,000 జీతం వస్తోంది. ఉద్యోగాన్ని కొనసాగించమని నేను అతనిని ఒప్పించటానికి ప్రయత్నించాను, కాని అతను వడా పావ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని పట్టుబట్టాడు" అని ఆమె చెప్పింది.


ఇప్పటికే చాలా మంది ఇదే పని చేస్తున్నందున తాను వద్దని వారించానని రంజనా అంటుంది. "ట్రాఫిక్ మధ్యలో ఒక పెట్టెలో విక్రయించాలనే ఆలోచన మరింత అవాస్తవంగా అనిపించింది. వినియోగదారులకు చిరుతిండిని ఒక ప్లేట్‌లో తాజాగా తినడం అలవాటు. అలాంటిది అలా పెట్టెలో ప్యాక్ చేసి ఇస్తానంటున్నాడు. ఇంకా వేడిగా తినడానికిఇష్టపడతారు. అలాగే, ఒక జంక్షన్ వద్ద ఆహారాన్ని అమ్మడం సాధ్యం కాని పని. సిగ్నల్ పడితే వాహనాలు కదులుతుంటాయనే భయం. ఇన్న అనుమానాలు వ్యక్తం చేశాను. అయినా నా కొడుకు వాటన్నింటిని ఎదుర్కుంటూ ధైర్యంగా ముందుకు సాగుతానన్నాడు.

గౌరవ్ పట్టుదల చూసి వ్యాపారం ప్రారంభించేందుకు కొడుకుకు లక్ష రూపాయలు ఇచ్చాను. అది నేను పొదుపు చేసి దాచుకున్న డబ్బు. వేస్ట్ చేస్తాడేమోనని నేను భయపడ్డాను. కానీ గౌరవ్ వ్యాపారం మొదలు పెట్టిన తరువాత పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని రెట్టింపుగా తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు" అని ఆమె చెప్పింది.

ప్రారంభ పెట్టుబడితో, గౌరవ్ వ్యాపారం కోసం వంట సామాగ్రిని కొనుగోలు చేశాడు. ప్యాకేజింగ్ కోసం మరి కొంత డబ్బు ఖర్చు చేశాడు. అతని తల్లి వండడానికి అంగీకరించగా, అతని భార్య ప్యాక్ చేసే బాధ్యతను తీసుకుంది. గౌరవ్ దానిని జంక్షన్ వద్ద అమ్మేవాడు.

"మేము మొదటి రోజు 50 వడా పావ్‌లను తయారు చేశాము. వాటిలో ఏవీ అమ్మబడలేదు. గౌరవ్ నిరాశతో తిరిగి వచ్చి, వాటన్నింటినీ ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేశానని చెప్పాడు. తరువాతి ఐదు రోజులు కూడా ఇదే కొనసాగింది.

"మరుసటి వారం కూడా వ్యాపారం అలానే ఉంటుందేమో అనుకున్నాం. కానీ గౌరవ్ ఒక గంటకే ఫోన్ మరికొన్ని పావ్‌లు సిద్ధం చేయమని చెప్పాడు. ఆ రోజు 100 కి పైగా వాడా పావ్‌లను విక్రయించాము. అప్పటి నుండి వ్యాపారం పుంజుకుంది అని రంజనా చెప్పారు.

ఇప్పుడు రోజుకు సుమారు 800 వడా పావ్లను విక్రయిస్తున్నానని, నెలకు రూ .2 లక్షల వ్యాపారం చేస్తున్నానని గౌరవ్ చెప్పాడు. "ఖర్చులు పోగా నేను నెలకు సుమారు 80,000 రూపాయలు సంపాదిస్తున్నాను. నేను కియోస్క్ అద్దెకు తీసుకున్నాను. ఆరుగురు అబ్బాయిలను పనిలో పెట్టుకున్నాను. వారికి నెలకు 6,000 రూపాయలు జీతం ఇస్తున్నాను. వారు ఆరెంజ్ టీ-షర్టులను యూనిఫారంగా ధరించడంతో వడాపావ్ విక్రేతలను గుర్తుపట్టడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్లు వీరి కోసం ఎదురు చూడ్డం మొదలు పెట్టారు. కొంత మంది ప్రయాణీకులు మా కియోస్క్ బండి వద్ద ఆగి వడాపావ్ తీసుకుని వెళుతున్నారు అని ఆనందంగా చెబుతున్నాడు గౌరవ్.

తల్లి రంజనా ఇప్పటికీ మసాలా దినుసులను మిళితం చేసి, వడాలకు పిండి చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story