తాతా.. నీ కష్టం వృధాగా పోలేదు..!

మనవరాలి చదువు కోసం ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకొని.. తన ఆటోలోనే జీవనం కొనసాగిస్తున్న ముంబై ఆటో డ్రైవర్ దేశ్‌రాజ్ కథనం పైన ఉహించని స్పందన వస్తుంది. ఈ కథనం నెటిజన్లని కదిలించడంతో దేశనలుమూలల నుంచి దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు అతని ఖాతాలోకి రూ.24 లక్షలు చేరాయి. దీనితో తన సంతోషాన్ని ప్రకటించాడు దేశ్‌రాజ్.. ఎలాంటి ఫలితం ఆశించకుండా మంచి మనసుతో ముందుకు వచ్చి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి దేశ్‌రాజ్ ధన్యవాదాలు తెలిపాడు. (మీ కష్టం వృధాగా పోదు తాత.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది!)
ఎవరీ దేశ్‌రాజ్?
దేశ్‌రాజ్ ముంబైలో ఉంటాడు.. అతనికి ఇద్దరు కుమారులు.. అయితే ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇందులో ఓ కుమారుడు పనికోసం బయటకు వెళ్లి ఓ వారం రోజుల తర్వాత శవమై కనిపించగా, మరో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు చనిపోవడంతో బాధను తనలోనే దాచుకొని.. తనకి తానే దైర్యాన్ని తెచ్చుకున్నాడు.. కృష్ణారామా అనుకుంటూ కాలక్షేపం చేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యత మొత్తం తన మీదా వేసుకొని.. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడపడం మొదలుపెట్టాడు.
మనవరాలి చదువుకోసం ఇల్లును అమ్మేశాడు..!
అయితే తాత కష్టాన్ని దగ్గరి నుంచి చూసిన దేశ్‌రాజ్ మనవరాలు విలవిల్లాడిపోయి.. తానూ చదువు మానేసి ఏదైనా పని చేస్తానని చెప్పింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న తన మనవరాలు చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని మరింతగా కష్టపడడం మొదలు పెట్టాడు దేశ్‌రాజ్... నేలంతా కష్టపడి.. రూ. 10 వేలు సంపాదించేవాడు. ఇందులో రూ.6 వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే... మిగతా డబ్బును కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు
అయితే తాత కష్టాన్ని ఆ మనవరాలు ఎప్పుడు వమ్ము చేయలేదు. ఇంటర్‌లో 80 శాతం మార్కులు సాధించింది. ఆ తర్వాత బీఈడీ చదువుతానని, ఢిల్లీకి వెళ్తానని చెప్పడంతో ఆమె చదువుకోసం ఇల్లును కూడా అమ్మేశాడు దేశ్‌రాజ్. తన కుటుంబాన్ని మొత్తం బంధువుల ఇంట్లో ఉండేలా ఏర్పాట్లు చేసి.. అయన మాత్రం ఆ ఆటోలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మనవరాలి చదవు కోసం ఆ పెద్దాయన తీసుకున్న నిర్ణయం అందరిని కదిలించింది. ఆయన సంకల్పం నెటిజన్లని ఆకట్టుకుంది.
ఫేస్‌బుక్ యూజర్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ..
దీంతో ఒక ఫేస్‌బుక్ యూజర్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించేందుకు ఉపక్రమించారు. అనేకమంది ఆ తాతకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా రూ. 24 లక్షల రూపాయలకి పైగా సర్దుబాటు అయినట్టుగా హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి వెల్లడించింది. నిజానికి వారు రూ .20 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ అనుకున్న దానికంటే అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దేశ్‌రాజ్ ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com