జాతీయం

దాతల సహృదయం.. ఇద్దరు చిన్నారుల చికిత్సకు రూ.32 కోట్లు విరాళం

చిన్నారులకు వచ్చిన అనారోగ్య సమస్యకు వేలు, లక్షలూ కాదు కోట్లలో ఖర్చు. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చాలంటే జీవితం సరిపోదు.

దాతల సహృదయం.. ఇద్దరు చిన్నారుల చికిత్సకు రూ.32 కోట్లు విరాళం
X

ఏం పాపం చేశాను.. నా బంగారు తల్లికి ఇంత కష్టం వచ్చింది. దేవుడా.. ఎందుకు పుట్టించావు ఇలాంటి బిడ్డని.. నా చిట్టి తల్లిని బతికించుకునే మార్గం కూడా నువ్వే చెప్పు అని ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. మరి దేవుడు ఆ తల్లి మొర ఆలకించాడో ఏమో.. దాతల రూపంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. చిన్నారికి పునర్జన్మను ప్రసాదించాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు చిన్నారులు పుట్టుకతోనే అరుదైన జన్యుసంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

పిల్లలను పెంచడమే భారమైన పేద కుటుంబాలకు ఇలాంటి సమస్యలు వస్తే మరింత కష్టం. చిన్నారులకు వచ్చిన ఆ అనారోగ్య సమస్యకు వేలు, లక్షలూ కాదు కోట్లలో ఖర్చు. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చాలంటే జీవితం సరిపోదు. అయినా ఏదో ఆశ.. బిడ్డలను బ్రతికించుకోవాలనే తాపత్రయం. ఈ విశాల ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని.. మంచి మనుషులు స్పందిస్తారని.. తమ చిన్నారులకు కొత్త జీవితాన్ని ఇస్తారని ఆశ పడ్డారు.

వారి ఆశలు ఫలించాయి.. దాతలు స్పందించారు.. ప్రముఖ ఔషధ సంస్థలు సైతం ఉచితంగా మందులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఒక చిన్నారి చికిత్సకు లాటరీ ద్వారా ఎంపిక చేయగా, మరో చిన్నారికి ప్రపంచ వ్యాప్తంగా దాతలు రూ.16 కోట్లు సమకూర్చారు. ఇద్దరు చిన్నారులు ఒకే వ్యాధి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) సమస్యతో బాధడుతున్నారు. దీనివల్ల కండరాలు క్షీణిస్తాయి.

బెంగళూరు చెందిన మహ్మద్ బాసిల్, ఖదీజా దంపతుల కుమార్తె ఫాతిమా (14 నెలలు) ఎస్ఎంఏతో బాధపడుతోంది. జోల్గెన్‌స్మా అనే జన్యుచికిత్స ద్వారానే ఈ వ్యాధి నయమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు దాదాపు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు డాక్టర్లు. తమతో అయ్యే పని కాదని చిన్నారి తల్లిదండ్రులు తల పట్టుకున్నారు. కానీ స్థానికంగా ఉన్న బాప్టిస్ట్ ఆస్పత్రి యాజమాన్యం పాపకు అవసరమైన చికిత్సను ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చారు.

ఆస్పత్రి, ప్రముఖ ఔషధ సంస్థ నోవార్టిస్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లాటరీ ద్వారా చిన్నారిని ఎంపిక చేసి చికిత్స చేశారు. మంగళవారం ఖరీదైన మందులను ఆపరేషన్ చేసిన చిన్నారికి అందించినట్లు ఆస్పత్రి సీఈవో డాక్టర్ నవీన్ థామస్ వెల్లడించారు.

ఇదే వ్యాధితో బాధపడుతున్న మరో చిన్నారి ముంబయిలో ఉంది. పాప పేరు టిరా కామత్ (5 నెలలు) అనే మరో చిన్నారికి ఎంఎస్ఏ ఉంది. చికిత్సలో భాగంగా పాపకు రూ.22 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతంత మాత్రమే ఉన్న తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితికి చిన్నారి చికిత్స తలకు మించిన భారం. దీంతో వారు పాపను కాపాడుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాతల సహాయం కోరారు. ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా సాయాన్ని అర్థించారు.

భారత్, కెనడా, ఆస్ట్రేలియా సహా 10 దేశాల దాతలు స్పందించారు. ఒక్కొక్కరు రూ.100 లు మొదలు రూ.5 లక్షల వరకు సాయం చేశారు. ఈ విధంగా రూ.16 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సాయ పడింది. చిన్నారికి ఇచ్చే ఇంజెక్షన్‌కు సంబంధించి దానిపై రూ.6 కోట్ల విలువైన పన్నును రద్దు చేసింది. ఇది రికార్డు స్థాయి కార్యక్రమం అని ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ మునుపెన్నడూ జరగలేదని ఇంపాక్ట్ గురు సంస్థ సీఈవో పీయూష్ జైన్ అన్నారు.


Next Story

RELATED STORIES