బ్రెస్ట్ క్యాన్సర్.. గుర్తించడం ఎలా

బ్రెస్ట్ క్యాన్సర్.. గుర్తించడం ఎలా
శరీరంలోని కొన్ని ముఖ్య భాగాలు కన్ను, మెదడు, గుండె, మూత్రపిండాలు వంటి ప్రత్యేక పనుల కోసం ఏర్పడిన అవయవాల్లో పుట్టినప్పుడు

క్యాన్సర్.. ఆ పేరు వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది.. ఏ చిన్న మార్పు జరిగినా శరీరం చెప్పేస్తుంది.. కానీ క్యాన్సర్ విషయానికి వచ్చే సరికి అర్థం కాదు.. అనారోగ్య కారణాలతో డాక్టర్ దగ్గరకు వెళితే క్యాన్సర్ సెకండ్ స్టేజ‌్‌లోనో, థర్డ్ స్టేజ్‌లోనో ఉందని చెబుతారు.. దానికి కీమోలంటూ ఇచ్చే థెరపీ మనిషిని సగం పీల్చి పిప్పి చేస్తుంది. అయినా ధైర్యంగా చికిత్స చేయించుకుని కోలుకున్న వాళ్లు ఈ మధ్య అత్యధికంగా తారసపడుతున్నారు.. సెలబ్రెటీలతో పాటు సాధారణ వ్యక్తులు సైతం మహమ్మారితో అలుపెరుగని పోరాటమే చేస్తున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ క్యాన్సర్ రోగులకు ధైర్యాన్ని అందిస్తున్నారు..

క్యాన్సర్ అనేది అనేక కణాల సముదాయం.. శరీరంలో ఈ కణ విభజన అనేది నిరంతర ప్రక్రియ. శరీరంలోని కొన్ని ముఖ్య భాగాలు కన్ను, మెదడు, గుండె, మూత్రపిండాలు.. వంటి ప్రత్యేక పనుల కోసం ఏర్పడిన అవయవాల్లో పుట్టినప్పుడు ఎన్ని కణాలైతే ఉంటాయో జీవితాంతం అవే ఉంటాయి. వయసొచ్చే కొద్దీ వీటి సంఖ్య తగ్గుతుందే కానీ పెరగదు. మరి కొన్ని కణాలు అవసరాన్ని బట్టి పుడుతుంటాయి. ఉదాహరణకు చర్మం, పేగు గోడల్లో 15-21 రోజులకోసారి కొత్త కణాలు పుట్టుకొచ్చి, పాతవి చనిపోతుంటాయి. ఎర్ర, తెల్ల రక్త కణాలు నిరంతరం విభజన చెందుతుంటాయి. వాటిపని పూర్తవగానే మరణిస్తుంటాయి.

వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి. ఇలా ఓ పద్దతి ప్రకారం జరుగుతుంటుంది. కానీ ఈ ప్రక్రియలో కణంలోని జన్యువులో వచ్చే మార్పు వల్ల ఒకటి లేదా కొన్ని పనికి రాని కణాలు ఓ పద్దతి లేకుండా నిరంతరం విభజన చెందుతూ ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి స్థలాన్ని ఆక్రమిస్తూ శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ఈ కణాలు మరణించవు. పెరగకుండా ఆగిపొమ్మని చెప్పే సంకేతం ఏదీ వాటి మీద పని చేయదు. దాంతో అవి పెరిగి కణితుల్లా ఏర్పడుతుంటాయి. ఫలితంగా శరీర యంత్రాంగంలోని అవయవాలన్నీ వాటి పని నిర్వర్తించలేక నిర్వీర్యమైపోతాయి. క్రమంగా మనిషి నీరసించి, మరణానికి చేరువవుతాడు. అదే క్యాన్సర్. ఈ కణాలు స్థనాలలో పెరిగితే అవి ప్రమాదకర ట్యూమర్‌లుగా మారతాయి. వాటినే బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు.

సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పాలను ఉత్పత్తి చేసే గ్రంధులని కణజాలంలో లేదా గ్రంధుల నుంచి చనుమొనలకు పాలను సరఫరా చేసే నాళాలలోనూ వస్తుంది. అతి కొద్ది మందిలో స్థన కండరాలకు వచ్చే అవకాశం ఉంది. 99 శాతం మందికి జన్యువులలో కలిగే అసాధారణ మార్పుల వల్ల వస్తుంది. కేవలం పది శాతం మందిలో మాత్రం వంశపారంపర్యగా వచ్చే అవకాశం ఉంది.

చాలా వరకు క్యాన్సర్ కారకాలు మన నియంత్రణలో ఉండవు. ఉదాహరణకు వయసు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య నేపథ్యం మొదలైనవి. అయితే అధిక బరువు, మద్యపానం వంటి వాటిని మనం నియంత్రించవచ్చు. అధిక బరువు కలిగి మెనోపాజ్ దశ దాటిన మహిళలకు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్‌కి దారి తీస్తాయి. మాంసాహారం, జంతు సంబంధిత కొవ్వు పదార్ధాల వినియోగం తగ్గించడం మంచిది. ఎందుకంటే వీటిలో వివిధ రకాల హార్మోనులు, యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాయామం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు కనీసం 45 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయాలి.

మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వీటి వాడకం వల్ల రక్తంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. దాని వల్ల కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.

స్థనాల పెరుగుదలకు ఈస్ట్రోజన్ హార్మోన్ తోడ్పడుతుంది. దీర్ఘకాలం పాటు బయటి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మానసిక ఒత్తిడి, ఆందోళనలను సాధ్యమైనంతవరకు తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకుంటే క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story