ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు.. కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు.. కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు.

దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య అధికార పార్టీ ఈ బిల్లును నెగ్గించుకుంది. ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని నిర్వచించే ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు -2021కు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇది వరకే లోక్‌సభలో ఆమోదం పొందగా.. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేటికైనా ఎల్జీ ఆమోదం తప్పనిసరి కానుంది.

ఇక ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశారు. మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ప్రశ్నించారు. స్కూళ్లు తెరవడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేయడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలు హరిస్తున్నారంటూ ఆప్‌ వ్యతిరేకిస్తుండగా.. పాలన వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను తొలగించేందుకు ఈ బిల్లు తెచ్చామని కేంద్ర సర్కారు చెబుతోంది.



Tags

Read MoreRead Less
Next Story