శానిటైజర్.. అప్పుడు నోస్టాక్.. ఇప్పుడు నో కస్టమర్

శానిటైజర్.. అప్పుడు నోస్టాక్.. ఇప్పుడు నో కస్టమర్
మాస్క్ ఒక్కటీ ధరిస్తున్నారు.. మరి కొన్ని రోజులు పోతే అవి కూడా పెట్టుకుంటారో లేదో డౌటే.

కరోనా వచ్చిన కొత్తల్లో కొందామంటే శానిటైజర్ లేదు.. మాస్కుల్లేవు.. మందుల్లేవు.. అన్నీ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.. కానీ ఇప్పుడు కొనే వాళ్లు కరువయ్యారు.. కరోనా సీజన్ అలా నడిచింది.. రాను రాను కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకున్నారు.. వస్తే రాని అప్పుడు చూసుకుందాం.. అనే స్టేజ్ కి వచ్చేశారు.. భయపడితే మరీ భయపెడుతుంది.. ఎదురుతిరిగితే అదే పారిపోతుంది అని అనుకున్నారేమో మాస్క్ ఒక్కటీ ధరిస్తున్నారు.. మరి కొన్ని రోజులు పోతే అవి కూడా పెట్టుకుంటారో లేదో డౌటే. ఒకప్పుడు శానిటైజర్ గురించి అంతగా తెలియదు.. కానీ కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ చిన్న శానిటైజర్ బాటిల్ అయినా తమతో పాటు ఉంచుకుంటున్నారు.. ఏం పట్టుకున్నా వెంటనే చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.. కాస్త శుభ్రత మీద శ్రద్ధ పెట్టారు కదా అనుకునేలోపు శానిటైజర్ అమ్మకాలు పడిపోయాయి.. షాపుల్లో స్టాక్ అలా పేరుకుపోతోంది అని వ్యాపారస్తులు వాపోతున్నారు. జూన్, జూలై నెలల్లో శానిటైజర్ కొరత ఉంటే.. ఇప్పుడు కొనేవారు లేరు.

కరోనా రాకతో శానిటైజర్లు మంచి డిమాండ్ ఉంటుందని భావించిన వ్యాపారస్తులు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇంతకు ముందు తాము చేస్తున్న వ్యాపారాలను సైతం పక్కన పెట్టి శానిటైజర్ ఉత్పత్తులకు డిస్ట్రిబ్యూటర్లుగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది డిస్ట్రిబ్యూటర్లుగా అవతారమెత్తారు. తీరా చూస్తే ఆరు నెలలు తిరిగే సరికి పరిస్థితి తారుమారైంది.. శానిటైజర్ల వ్యాపారం మూలపడింది.. ఏప్రిల్ మొదటి వారంలో 100ఎంల్ శానిటైజర్ బాటిల్ కొనాలన్నా రూ.150లు ఉండేది.. దుకాణాలకు సరఫరా చేసే ఐదు లీటర్ల శానిటైజర్ ధర రూ.2వేలు ఉండేది.. కేంద్ర ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించడంతో ఐదు లీటర్ల క్యాన్ ధర వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఆగస్టు చివరి నాటికి అది కూడా తగ్గి అదే క్యాను రూ.400 లకు అమ్మే పరిస్థితి వచ్చింది. కరోనా రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య తగ్గడంతో జనంలో కరోనా అంటే భయం పోయింది.. సాధారణ జ్వరంలాగే వచ్చి పోతుంది అని ఓ ధృఢ నిశ్చయానికి వచ్చేశారు.. మన మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్పినట్టుగా కరోనాతో కలిసి సహజీవనం చేసేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story