పార్లమెంట్ సాక్షిగా పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం గట్టి షాక్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయం లో దాయాది దేశం నాటకాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని వార్నింగ్ ఇచ్చింది. పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసు అంటూ పాక్‌కు సూటిగానే హెచ్చరికలు పంపింది. కశ్మీర్ విభజన, ఆర్టికల్-370 రద్దుపై పార్లమెంట్‌ లో జరిగిన చర్చలో మోదీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌లు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చెలరేగిపో తున్న వేళ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై తన విధానమేంటో ఉభయసభల సాక్షిగా కుండబద్దలు కొట్టింది. పీఓకే మాదే.. ఎప్పటికైనా అది భారత్‌లో అంతర్భాగమే... పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు అంటూ కేంద్ర హోంమంత్రి అమి త్ షా, పాకిస్థాన్‌కు సూటిగానే వార్నింగ్ ఇచ్చారు.

కశ్మీర్ విషయంలో గతంలో జరిగిన పరిణామాలను అమిత్ షా ఏకరవు పెట్టారు. కశ్మీర్‌ను కబళించడానికి పాకిస్థాన్ చేసిన కుట్రలను వివరించారు. 4 సార్లు యుద్ధం చేసినప్పటికీ కశ్మీర్‌ను భారతదేశం నుంచి తొలగించలేకపోయిందన్నారు. జమ్మూకశ్మీర్ యావత్తూ భారతదేశంలో అంతర్భాగమని తేల్చి చెప్పారు. రాజ్యసభలో కూడా కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిధిలోకి పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.

కశ్మీర్ వేర్పాటువాదులకు కూడా మోదీ సర్కారు వార్నింగ్ ఇచ్చింది. హురియత్ కాన్ఫరెన్స్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వేర్పాటువాదులతో ఎలాంటి చర్చలు ఉండబోవని అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేవరకు పాకిస్థాన్‌తోనూ చర్చలు ఉండబోవన్నారు. మొత్తమ్మీద ఆర్టికల్-370 రద్దు-కశ్మీర్ విభజనతో మోదీ సర్కార్, ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కొట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పీఓకే విషయంలో పాకిస్థాన్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని చెబుతున్నారు. అక్సాయ్ చిన్ విషయంలోనూ చైనాకు పరోక్షంగా హెచ్చరికలు పంపిందని పేర్కొంటున్నా రు. పనిలో పనిగా కశ్మీర్ వేర్పాటువాదులకూ క్లారిటీ ఇచ్చిందని, వారిని పట్టించుకునే ప్రసక్తే లేదన్నట్లుగా మోదీ ప్రభుత్వ వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story