తమిళనాడు రాజకీయాలు.. విజయకాంత్ ఆరోగ్యం పట్ల కార్యకర్తలు ఆందోళన

తమిళనాడు రాజకీయాలు.. విజయకాంత్ ఆరోగ్యం పట్ల కార్యకర్తలు ఆందోళన
డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో రోజురోజుకు రాజకీయాలు మారిపోతున్నాయి. చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికార అన్నాడీఎంకేలో చీలిక తెస్తారని జోరుగా చర్చలు జరిగాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు.

మరోవైపు అన్నాడీఎంకేలో సీట్ల లొల్లి నడుస్తోంది. 136 మంది ఎమ్మెల్యేల్లో చాలామందిని పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 45 మందికి సీటు ఇవ్వడం లేదని సమాచారం. ఇందులో ఐదుగురు మంత్రులు కాగా, అందులోనూ ముగ్గురు మహిళలున్నట్టు ఎడప్పాడి వర్గీయులు చెబుతున్నారు. 234 నియోజకవర్గాలకు గాను సీటు ఆశించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అన్నాడీఎంకే అవకాశం కల్పించగా మొత్తం 14 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ 35 సీట్లు అడగ్గా.. 23 సీట్లు మాత్రమే ఇస్తామని తెలిపింది. గత పది సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. గ్రామసభలతో స్టాలిన్ ప్రచారం ముమ్మరం చేశారు.

ఇక కమల్ పార్టీ మక్కల్‌ నీదిమయ్యంతో ఎన్నికల పొత్తు ఖరారైందని సమత్తువమక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ ప్రకటించారు. కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యంతో సమత్తువమక్కల్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖరారైందని తెలిపారు.

అటు డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు విజయకాంత్‌ ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయకాంత్‌కు సాధారణ వైద్యపరీక్షలు జరిపామని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయకాంత్‌ ఆస్పత్రికి వెళ్లడం పట్ల డీఎండీకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

మొత్తానికి పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ తమిళ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story