234 నియోజకవర్గాల్లోనూ రజనీకాంత్ పోటీ.. పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి?

234 నియోజకవర్గాల్లోనూ రజనీకాంత్ పోటీ.. పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి?

సూపర్‌ స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి. అధికారికంగా ప్రకటించలేదు గాని.. దాదాపు ఇదే పేరు ఖాయమైనట్టు తమిళనాడు మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తెలుగులో ప్రజా సేవ పార్టీ అని అర్థం వస్తుంది. రజనీకాంత్ పార్టీ ఎన్నికల గుర్తుగా ఆటో రిక్షాను ఖరారు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీ గుర్తు ఏంటనేది రజనీనే అధికారికంగా ప్రకటిస్తారు. పార్టీ జెండా, పార్టీ పేరును కూడా డిసెంబర్ 31నే అఫీషియల్‌గా డిక్లేర్ చేయనున్నారు. ఆటో రిక్షాను ఎన్నికల గుర్తుగా కేటాయిస్తారన్న వార్తలతో రజనీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది ఆటోనేనని, మాస్‌ను ఆకట్టుకుంటుందని చెప్పుకుంటున్నారు. పైగా బాషా సినిమాలో రజినీకాంత్ ఆటోడ్రైవర్‌గా నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

రజనీ పార్టీ గుర్తుగా బాబా ముద్రను కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. కాని, నిబంధనల ప్రకారం ఈసీ దీనికి అంగీకరించలేదు. బాబా ముద్రకు బదులుగా ఆటోను కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే మక్కల్ శక్తి కజగం పేరుతో పార్టీ పెట్టాలనుకున్నారు. కాని, కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని కూడా తిరస్కరించినట్లు తమిళ మీడియా చెబుతోంది.

ఇదివరకు రజనీకాంత్ తన పేరు మీద పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. రజినీ మక్కల్ మండ్రం పేరు మీద పార్టీ రిజిస్టర్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టారు. మక్కల్ సేవై కట్చి పేరును ఖరారు చేయాలని ఈసీకి ప్రతిపాదనలను పంపించారు. రజినీ మక్కల్ మండ్రం ఏ మాత్రం క్రియాశీలకంగా ఉండకపోవడంతో పాటు పెద్దగా అచ్చి రావట్లేదని రజనీకాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇప్పటికే, క్షేత్రస్థాయిలో పార్టీ పనులు కూడా జరుగుతున్నాయి. 38 జిల్లాలకు అభిమాన సంఘం అధ్యక్షులనే ప్రజా సేవ పార్టీ ప్రెసిడెంట్లుగా నియామించనున్నారని తెలుస్తోంది. జర్నలిస్టులు, వైద్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని రజనీ నిర్ణయించుకున్నారు. ఇతర పార్టీల నేతలను ఇప్పుడే తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు రజనీకాంత్. వచ్చే మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని రజనీకాంత్ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా.


Tags

Read MoreRead Less
Next Story