Sasikala: శశికళ రాజకీయ ప్రవేశంపై రూమర్స్.. ఇంతకీ చిన్నమ్మ ఏమనుకుంటోంది?

Sasikala (tv5news.in)

Sasikala (tv5news.in)

Sasikala: జయలలిత నెచ్చెలి శశికళ కీలక ప్రకటన చేయబోతున్నారా?

Sasikala: జయలలిత నెచ్చెలి శశికళ కీలక ప్రకటన చేయబోతున్నారా? అన్నాడీఎంకేను పరుగులు పెట్టించడానికి ప్రణాళికలు ప్రకటించబోతున్నారా? జయలలిత సమాధి వద్దకు శశికళ రావడానికి కారణమేంటి? తమిళనాడులో ఇదే అంశంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద ఉన్న జయలలిత సమాధి వద్దకు శశికళ వస్తుండడంతో.. చిన్నమ్మ ఏం చెప్పబోతోందన్నది ఆసక్తిగా మారింది.

జైలుకు వెళ్లే ముందు జయలలిత సమాధి మీద మూడుసార్లు కొట్టి శపథం చేశారు. దాని వెనక అంతరార్ధం ఏంటో ఇప్పటికీ తెలీదు. అయితే, ఎన్నికల తరువాత మొదటిసారి జనాల్లోకి వస్తున్న శశికళ.. రాజకీయరంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేయబోతోందనే టాక్ నడుస్తోంది. రేపటికి అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది.

ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయాన్ని చిన్నమ్మ తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజులుగా శశికళ నుంచి స్టేట్‌మెంట్స్‌ వస్తున్నాయి. నమదు ఎంజీఆర్‌ పత్రిక ద్వారా శశికళ రోజుకో ప్రకటన చేస్తున్నారు. తాను మళ్లీ పార్టీలోకి వస్తున్నానంటూ కేడర్‌కు సంకేతాలు పంపించారు.

అన్నాడీఎంకే అందరిదీ అంటూ ప్రకటనలిస్తున్నారు. పార్టీలో అందరూ సమానమేనంటూ కామెంట్స్ చేశారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానమని, కేడర్‌ను బిడ్డల్లాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో శశికళ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే జిల్లాల్లోని అన్నాడీఎంకే నేతలకు ఫోన్లు చేసి చెప్పారని సమాచారం. శశికళ ఆదేశాలకు తగ్గట్టుగా స్థానిక నేతలు పర్యటన ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. తన భవిష్యత్‌ ప్రణాళికపై శశికళ ఇవాళ ప్రకటన చేయొచ్చని అంతా భావిస్తున్నారు. సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలయ్యారు శశికళ. ఆనాడు భారీ కాన్వాయ్‌తో చెన్నైలో అడుగుపెట్టారు.

అన్నాడీఎంకేని చేతిలోకి తీసుకుంటుందని, జయలలిత స్థానంలో కూర్చుంటుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రకటించిన్నట్టుగానే పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు శశికళ నుంచి స్టేట్‌మెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోవడంతో పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది శశికళ. వ్యూహాలకు పదునుపెడుతూ.. కేడర్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story