Summer 2023 : ఎండలు మండిపోతున్నాయి

Summer 2023 : ఎండలు మండిపోతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్ టెంపర్ రేపుతోంది. భగభగమంటున్న భానుడి ప్రతాపానికి మాడు పలిలేలా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మంటలు పుట్టిస్తున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే ఈ రేంజ్‌లో సూర్యుడు మండిపోతున్నాడంటే.. వచ్చే మే నెలలో ఇంకెంత మంటలు పుట్టిస్తాడోనని తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎండలు పెరుగుతున్నాయి. నిన్న రెంటచింతలలో అత్యధికంగా 42.6 డిగ్రీలు, నెల్లిమర్లలో 41 .9 డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41 .5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక వడగాలుల తీవ్రత మరింత పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న వడగాలుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు 15 జిల్లాల్లోని 126 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9 మండలాలు, అనకాపల్లి జిల్లాలోని 14, తూర్పుగోదావరి జిల్లాలో 16, ఏలూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 6, కాకినాడ జిల్లాలో 12, కోనసీమ జిల్లాలో ఒక మండలం, కృష్ణా జిల్లాలో 6, ఎన్టీఆర్ జిల్లాలో 14, పల్నాడు జిల్లాలో ఒక మండలం, మన్యం జిల్లాలో 11, శ్రీకాకుళం జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 18, కడప జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలోను ఎండలు మరింత మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. గరిష్ఠంగా నిర్మల్‌ జిల్లాలో 42.8 డిగ్రీలు నమోదైంది. నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలలో 42.6, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 42.7, ఖమ్మం జిల్లాలో 42.5, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలలో 42.2, సూర్యాపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో 42.4, పెద్దపల్లి, నిజామాబాద్‌, వనపర్తి జిల్లాలో 42.1, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

మరోవైపు రానున్న ఐదురోజుల పాటు దేశంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు వాయివ్యంలోని కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story