40 అంతస్తుల ట్విన్‌ టవర్స్ కూల్చేయండి: సుప్రీంకోర్టు

40 అంతస్తుల ట్విన్‌ టవర్స్  కూల్చేయండి: సుప్రీంకోర్టు
Supreme Court: నోయిడాలోని సూపర్ టెక్ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.

Twin towers in Noida: నోయిడాలోని సూపర్ టెక్ బిల్డర్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్ కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతే కాదు.. కొనుగోలుదారులకు 12 శాతం వడ్డీతో వాళ్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని పడగొట్టే కార్యక్రమం కూడా సూపర్‌టెక్‌ లిమిటెడ్ డబ్బుతోనే జరగాలని, అది కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఢిల్లీని ఆనుకుని నోయిడాలో ఉన్న ఈ హైరైజ్ బిల్డింగ్స్‌ వ్యవహారం 2014లోనే కోర్టుకు చేరింది.

అలహాబాద్ హైకోర్టు 2017లో ఈ అక్రమాల్ని నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్డర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. U.P అపార్ట్‌మెంట్‌ యాక్ట్‌కి విరుద్ధంగా ప్లాన్‌లో ఎక్కడా ఉల్లంఘనలు లేవని విన్నవించుకున్నారు. ఈ వాదనల తర్వాత టవర్స్‌ కూల్చివేతపై స్టే ఇచ్చిన కోర్టు, ఈలోపు కొనుగోలుదారులు ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే ఇచ్చేయాలని స్పష్టం చేసింది. చివరికి ఇవాళ తీర్పు ఇస్తూ ఈ జంట భవనాల కూల్చివేతను సమర్థించింది.

915 ఫ్లాట్లకు, 21 షాప్‌లకు సంబంధించి, వాటి కొనుగోలుదార్లకు పరిహారం పూర్తిగా చెల్లించాల్సిందేనని చెప్పింది. ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘనలు నిజమేనని చెప్తూ ఆగస్టు 4నే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. కన్‌స్ట్రక్షన్ కంపెనీతో కుమ్మక్కైన నొయిడా అధారిటీ అధికారుల అవినీతిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ 40 అంతస్తుల అపార్ట్‌మెంట్లలో 633 ఫ్లాట్లు మొదట్లోనే బుక్ అయిపోయాయి. ఈ కోర్టు కేసుల తర్వాత 133 మంది కస్టమర్లు వేరే ప్రాజెక్టుల్లోకి మారిపోగా, 248 మందికి డబ్బులు తిరిగి ఇచ్చేశామని సూపర్ టెక్ బిల్డర్స్‌ యాజమాన్యం చెప్తోంది. మిగతా వారికి కూడా చెల్లింపులు చేస్తామంటోంది.

Tags

Read MoreRead Less
Next Story