ధైర్యంలో బ్రతుకు వుంది.. భయంలో చావు వుంది..: స్వామీ వివేకానంద

ధైర్యంలో బ్రతుకు వుంది.. భయంలో చావు వుంది..: స్వామీ వివేకానంద
ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.. దానికోసం నిరంతరం శ్రమించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా,

Swami Vivekananda స్వామీ వివేకానందుడు జీవించింది కొద్ది కాలమే అయినా.. ఆయన పలుకులు తేనెలొలుకు.. ఆయన మాటలు అక్షర తుణీరాలు.. ఆయన వ్యక్తిత్యం, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. 1863 జనవరి 12న కోల్‌కతాలో జన్మించిన వివేకానందుడు.. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు. ఆయన ఆశయం, ఆయన ఆకాంక్ష యువతను జాగృతం చేయడం. దేశాన్ని ముందుకు నడిపించడంలో యువత పాత్ర ప్రముఖమైనదిగా చెబుతుంటారు. చిన్న చిన్న విషయాలకు కృంగిపోకూడదనేది ఆయన ప్రసంగాల్లోని ఆంతర్యం. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.. దానికోసం నిరంతరం శ్రమించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లాలి. నీగమ్యాన్ని చేరుకోవాలి.

ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ మీద మనం జన్మించాం. సమాజంలో మంచి చెడూ రెండూ ఉంటాయి.. నీకంటూ ఒక ధృఢ నిర్ణయం ఉన్నప్పుడు దానికోసం కట్టుబడి ఉండాలి. ఓటమి ఎదురైనా నిరాశ చెందక గెలుపుకోసం ప్రయత్నించాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యను నేర్పిన గురువులు, జీవిత పాఠాలు నేర్పిన సహచరులు.. అందరి సహకారంతో ఓ ఆదర్శవ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి.

నయవంచనతో నలుగురికి హాని తలపెట్టాలని చూడక.. వీలైనంత మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఏ పని చేసినా మనం చేసేది మంచిదా కాదా.. నేను చేసే పని వల్ల నాకు కానీ, నాతోటి వారికి కానీ హానీ కలుగుతుందా అనేది ఆలోచించి చేయమంటారు వివేకానందుడు. అందుకే రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి అంటారు. అలాచేయకపోతే మీలో ఓ అద్భుతమైన వ్యక్తి దాగి ఉన్నారనే విషయం మీరు గుర్తించలేరని చెబుతారు.

అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తుల గురించి తెలుసుకుని ఎంతో ఆనందిస్తాం.. వారు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించి ఉంటారో తెలుసుకోవాలి. ఓ మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. మిమ్మల్ని బలహీనపరిచే విషయాన్ని విషంతో సమానంగా భావించి తిరస్కరించమని చెప్పిన వివేకానందుని మాటలు అక్షర సత్యాలు. అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్ననాడే ఉన్నవాటితోనే సంతృప్తి చెంది అందులోనే అవకాశాలను వెతుకున్న ఆదర్శమూర్తులు ఎందరో. నువు చేసే పని మంచిదని నీకు బలంగా అనిపించినప్పుడు కచ్చితంగా దాన్ని చేయమంటారు.

నేటి యువతకు ఎన్నో అవకాశాలు.. ఏదో చేయాలన్న తపన చాలా ఉంది.. కానీ అంతలోనే నిరుత్సాహం.. ఓటమిని అంగీకరించలేకపోతున్నారు.. పరీక్షల్లో ఫెయిలైతే ఆత్మహత్యలు, ప్రేమలో ఓడిపోతే ప్రాణం తీసుకోవడం.. ఎంతో జీవితం ఉన్నవారు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నాయి. సమాజ ప్రగతికి అవరోధాలవుతున్నాయి యువతీ యువకుల ఆత్మహత్యలు. పురాణ గ్రంధాలు ఔపోసాన పట్టకపోయినా నేటి యువత వివేకానందుని జీవిత చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఆయన వందేళ్లక్రితం చేసిన ప్రసంగాలు ఆనాటి యువకులతో పాటు నేటికీ, మరెప్పటికీ యువతకు ప్రేరణగా నిలుస్తాయి.

వివేకానందుని సూక్తులు కొన్ని...

లేవండి, మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి..

విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశ చెందకు, విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు.

రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి.. లేకపోతే ఓ అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు.

మీకు సాయం చేస్తున్న వారిని మరవకండి.. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి.. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి

ఎవరి కోసమో, దేని కోసమో ఎదురు చూడకండి, మీరు చేయగలిగింది చేయండి, ఎవరి మీదా ఆశ పెట్టుకోకండి.

మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేన్నయినా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి.

కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు

నీ వెనుక ఏముంది.. నీముందు ఏముంది అనేది నీకు అనవసరం.. నీలో ఏముంది అనేదే ముఖ్యం.

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.

జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే.

ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే.. జరగాల్సిన పనులు అవే జరుగుతాయి.

చావు బతుకులు ఎక్కడో లేవు.. దైర్యంలో బ్రతుకు వుంది.. భయంలో చావు వుంది.

కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి.

"వెనకాల ఏముంది.. ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం".

"ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది".

"జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు కానీ అదే వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే".

"మనం ఎంత ముందుకు వచ్చి ఇతరులకు మంచి చేస్తే మన హృదయాలు అంత పరిశుద్ధమవుతాయి. దేవుడు కూడా వారిలోనే ఉంటాడు".

"ఆత్మకు సాధ్యం కానిది ఏమి లేదని ఎప్పుడూ అనుకోకండి. అలా ఆలోచించడం గొప్ప మతవిశ్వాసం. పాపం అనేది ఉన్నట్లయితే మీరు బలహీనంగా ఉన్నారని లేదా ఇతరులు బలహీన పడ్డారని చెప్పడం మాత్రమే పాపం".

"దేన్ని ఖండించవద్దు. మీరు సహాయం చేయగలిగితే చేయండి. మీరు చేయలేకపోతే మీ చేతులతో వారిని ఆశీర్వదించండి. అలాగే వారి మార్గాల్లో వారిని వెళ్లనివ్వండి".

"ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులన్నీ అవే జరుగుతాయి."

"ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని ఆకాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు."

"విశ్వంలోని శక్తులన్నీ ఇప్పటికే మనందరివి. మీ చేతులను కళ్లకు అడ్డుపెట్టుకొని ఏడుస్తుండటమే చీకటి"

"నిజమైన విజయానికి రహ్యం ఏంటంటే పురుషుడు లేదా స్త్రీ ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సంపూర్ణ నిస్వార్థంగా ఉండటమే నిజమైన విజవంతులు".

"మీరు లోపలి నుంచి ఎదగాలి. ఎవరూ మీకు నేర్పించలేరు. ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించలేరు. మీ ఆత్మ తప్ప వేరే గురువు లేరు".

Tags

Read MoreRead Less
Next Story