గాంధీ ఆస్పత్రి నర్సుకు తొలి టీకా..

గాంధీ ఆస్పత్రి నర్సుకు తొలి టీకా..
వైద్యులను మించి కోవిడ్ రోగులకు నర్సులు విశేష సేవలందిస్తున్నారు. ఈ ప్రయాణంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు.

ప్రపంచ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. రోగుల ప్రాణాలను కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేసిన ఆరోగ్య సిబ్బందికి మొదటి ప్రాదాన్యం ఇస్తూ వారికే తొలి టీకాను వేయాలని నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో తొలి టీకా ఎవరికి ఇవ్వాలనే స్పష్టత వచ్చిన అనంతరం గాంధీ ఆస్పత్రి నర్సుకు ఇవ్వాలని నిర్ణయించారు. వైద్యులను మించి కోవిడ్ రోగులకు నర్సులు విశేష సేవలందిస్తున్నారు. ఈ ప్రయాణంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారు. ఈ నేపథ్యంలో మొదటి టీకాను వారికి ఇస్తే నర్సుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.

టీకా రాష్ట్రానికి చేరిన రెండు రోజుల్లోపే పంపిణీ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మూడు కోట్ల డోసుల నిల్వకు సరిపడా ప్రత్యేక కోల్డ్ చైన్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా ఉన్న నాలుగు శాఖల సిబ్బంది, 50 ఏళ్ల పైబడిని వారికి తొలి దశలో టీకా ఇవ్వనున్నారు. వీరి సంఖ్య రాష్ట్రంలో 80 లక్షల వరకు ఉంటుందని అంచనా.

అలాగే టీకా ఇవ్వడానికి ముందు ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇక టీకా రెండు డోసులు తీసుకున్న అనంతరం ఐమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్య సిబ్బందికి సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 2,79,644 కాగా మరణాల సంఖ్య 1,505కు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story