లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటున్నారా.. జాగ్రత్తండోయ్

లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటున్నారా.. జాగ్రత్తండోయ్
పని ప్రదేశాలతో పోల్చితే గృహాలలో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని అధ్యయన రచయితలు అభిప్రాయపడుతున్నారు.

కోవిడ్ వచ్చి చిన్న చిన్న ఆనందాలను కూడా దూరం చేస్తోంది.. లంచ్ బాక్స్ షేర్ చేస్తే కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయి కొత్త అధ్యయనాలు. ఈ విషయాన్ని ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) జర్నల్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో ప్రచురించారు. థాయ్‌లాండ్‌లో 839 మంది వ్యక్తులపై జరిపిన పరిశోధనా ఫలితాల గురించి వివరించింది.

ఫేస్ మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం వ్యాధి వ్యాప్తి ప్రభావాన్ని తగ్గిస్తుందని ప్రాధమిక నివేదిక పేర్కొంది. తాజాగా చేసిన అధ్యయనాల్లో పంచుకునే వ్యక్తులు తమ ఆహారం మరియు పానీయాలను తమ వద్దే ఉంచుకున్న వారి కంటే కోవిడ్ సంక్రమించే అవకాశం 2.71 రెట్లు ఎక్కువ అని గుర్తించారు.

పని ప్రదేశాలతో పోల్చితే గృహాలలో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని అధ్యయన రచయితలు అభిప్రాయపడుతున్నారు. వైరస్ సోకిన కుటుంబ సభ్యుడిని చూసుకునేటప్పుడు, వైరస్ సోకిన వ్యక్తి ఒక గదిలో ఉండాలి, వీలైతే వారికి ప్రత్యేక బాత్రూమ్ తో పాటు వాళ్లు వాడిన కప్పులు, ఇతర పాత్రలను పంచుకోవద్దు" అని వారు హెచ్చరించారు.

మహమ్మారి ప్రారంభంలో నైట్ పార్టీల పేరుతో బయట తిరిగే పౌరులకు థాయిలాండ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. మార్చిలో దేశ ఆరోగ్య మంత్రి జారీ చేసిన ఒక ప్రకటనలో 13 కేసులు.. మద్యం, సిగరెట్లు పంచుకుని కరోనా బారిన పడిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. కొత్తగా చేసిన సిడిసి అధ్యయనంలో సిగరెట్లు పంచుకున్న వారు కోవిడ్ సంక్రమించే అవకాశం 6.12 రెట్లు ఎక్కువ అని తెలిపింది.

జూలైలో జరిపిన ఒక అధ్యయనంలో 11 మంది కరోనా సోకిన వారిని పరిశీలించగా ఒక పార్టీలో వారంతా కలిసి ఆల్కహాల్‌ని పంచుకున్నట్లు పేర్కొంది. రెస్టారెంట్లలో, ఫుడ్ కోర్టులలో డిస్పోజబుల్ పాత్రల వాడకాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. మహమ్మారి మధ్య పర్యావరణ సమస్యల కంటే ఉద్యోగుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story