ఆస్పత్రి బిల్లు కట్టలేక బిడ్డను అమ్మి..

ఆస్పత్రి బిల్లు కట్టలేక బిడ్డను అమ్మి..
పేదవారికోసమే పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ అందవలసిన వారికి అందక దారిద్ర్యంలోనే గడుపుతోంది సగం భారతావని.

30 వేల రూపాయల బిల్లు చెల్లించలేని దీన స్థితిలో పొత్తిళ్లలోని పురిటి బిడ్డని ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించింది పూట గడవడమే కష్టమైన ఆ జంట. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన దళిత దంపతులు తమ బిడ్డను బిల్లు చెల్లించే మార్గం లేనందున ఆసుపత్రికి అమ్మారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఈ వాదనను ఖండించింది. శిశువును దత్తత కోసం తమకు అప్పగించినట్లు చెప్పారు. శిశువు తల్లి బబిత గత వారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలో జాయినైంది. ఆగస్టు 24 సాయంత్రం 6.45 గంటలకు బబిత ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు ఆస్పత్రి సిబ్బంది. ఆపరేషన్ కు రూ.30,000, మందుల కోసం మరో రూ.5,000 ఖర్చయింది.

బబితా భర్త శివ చరణ్ రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి వద్ద అంత డబ్బు లేదు. ఆసుపత్రి బిల్లు చెల్లించలేకపోయాడు. దాంతో బిల్లును ఎలా కట్టాలనే సమాలోచనలో పడ్డారు భార్యాభర్తలు. వారి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. బిల్లు కట్టలేకపోతే బిడ్డను ఇచ్చి లక్ష రూపాయలు తీసుకోమని ఆఫర్ ఇచ్చింది. అందుకు అంగీకరించిన ఆ జంట నవమాసాలు మోసిన ఆ బిడ్డను గుండె రాయి చేసుకుని ఆస్పత్రి సిబ్బందికి లక్ష రూపాయలకు అప్పగించారు. అక్షరం ముక్క రాని ఆ జంట అన్ని పత్రాలపై వేలి ముద్రలు వేసి కన్నీళ్లతో బిడ్డను ఒకసారి తడిమి చూసుకున్నారు.

ఈ సంఘటనను తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ ఈ వ్యవహారంలో పాల్గొన్న వ్యక్తులపై సరైన దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హాస్పిటల్ యాజమాన్యం తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. శిశువును దత్తత కోసం బిడ్డ తల్లిదండ్రులు ఆస్పత్రిలో వదిలివేసినట్లు పేర్కొంది. జెపి హాస్పిటల్ మేనేజర్ సీమా గుప్తా మాట్లాడుతూ, "ఈ వాదనలు తప్పు. మేము అతడిని తన బిడ్డను వదులుకోమని బలవంతం చేయలేదు. అతను తన ఇష్టానుసారమే అలా చేశాడు. తల్లిదండ్రులు వేలిముద్రలు వేసిన వ్రాతపూర్వక ఒప్పంద పత్రం కూడా మా దగ్గర ఉంది అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story