Union Budget 2022 : సీతమ్మ వరమిచ్చేనా? బోలెడు ఆశలతో సామాన్యుడు...!

Union Budget 2022 :  సీతమ్మ వరమిచ్చేనా? బోలెడు ఆశలతో సామాన్యుడు...!
Union Budget 2022 : ప్రతిసారి బడ్జెట్ నుంచి ఏదో ఆశించడం, నిర్మలమ్మ నిరాశపరచడం జరుగుతూనే ఉంది.

Union Budget 2022 : బడ్జెట్‌ వస్తోందంటే చాలు.. మనకేం ఇస్తారు అనే సామాన్యుడు ఎదురుచూస్తుంటాడు. ప్రతిసారి బడ్జెట్ నుంచి ఏదో ఆశించడం, నిర్మలమ్మ నిరాశపరచడం జరుగుతూనే ఉంది. అసలే రెండేళ్ల పాటు కరోనా పరిస్థితులు, ఆంక్షల కారణంగా సామాన్యులు చితికిపోయారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని చెప్పినా.. దాన్నుంచి సామాన్యుడికి డైరెక్ట్‌గా రూపాయి వచ్చింది లేదు. దీంతో ఈసారైనా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతారా, లేదా ఎప్పటిలాగే పారిశ్రామిక వర్గానికే పెద్ద పీట వేస్తారా అన్న ఉత్కంఠ వెంటాడుతోంది.

అయితే, నిర్మలా సీతారామన్‌ మాత్రం వేతన జీవులు ఆశించిన ప్రయోజనాలేవీ ఇవ్వకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉన్నందున ఈసారి కొత్త సంస్కరణల జోలికి వెళ్లకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధిరేటును పెంచేలాగే నిర్మలమ్మ బడ్జెట్‌ ఉంటుందని, సామాన్యులకు ఈ బడ్జెట్‌లో ఊరట తక్కువేనని చెబుతున్నారు.

ముఖ్యంగా వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం 10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారంతా 30శాతం పన్ను పరిధిలోకి వస్తున్నారని, ఈ కేటగిరీని 20 లక్షలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పైగా 80C, 80D, గృహ రుణాలపై వడ్డీ వంటి వాటిపై ప్రస్తుతం ఉన్న మినహాయింపులను పెంచాలని ట్యాక్స్‌ పేయర్స్‌ కోరుతున్నారు. బీమా సంస్థలు ప్రీమియం విపరీతంగా పెంచిన నేపథ్యంలో.. ఆరోగ్య బీమా మినహాయింపులను 50 వేలకు పెంచాలని, సర్‌చార్జీ రేట్లను తగ్గించాలని ఆకాంక్షిస్తున్నారు. 80C కింద ప్రస్తుతం లక్షన్నర వరకు ఉన్న మినహాయింపును పెంచితే.. పౌరులకు సేవింగ్స్‌ పట్ల ప్రోత్సాహం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గృహ రుణాల వడ్డీపై మినహాయింపులను ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

నిర్మల బడ్జెట్‌ నుంచి బ్యాంకులు చాలానే ఆశిస్తున్నాయి. పన్ను రహిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మూడేళ్ల కాలానికి తగ్గిస్తే డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకొస్తారని బ్యాంకులు చెబుతున్నాయి. బైక్‌లపై జీఎస్‌టీ 18 శాతానికి తగ్గిస్తే గిరాకీ పెరిగి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని డీలర్ల అసోసియేషన్‌ చెబుతోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్‌ రైళ్లను ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే 75 వారాల్లో 75 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ప్రకటించినందున వాటిపై ప్రత్యేక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. ఇక క్రిప్టో కరెన్సీలపై టీడీఎస్‌ లేదా టీసీఎస్‌ అమలయ్యేలా బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరుతున్నారు. పరిమితికి మించి జరిగే లావాదేవీలపై పన్ను విధించడానికి ఆ వివరాలు ఆదాయ పన్ను విభాగానికి చేరేలా చూడాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story