ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన డ్యామ్‌

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన డ్యామ్‌
రుషి గంగ పవర్‌ ప్రాజెక్టు దగ్గర ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ధౌలి గంగా నదిలో ఒక్కసారిగా ప్రవాహనం పెరగడంతో డ్యామ్‌ కొట్టుకుపోయింది.

దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో భారీ జలఉత్పాతం చోటు చేసుకుంది. సమీపంలోని మంచు కొండచెరియలు విరిడి పడటంతో.. ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. ఫలితంగా ఈ రెండు నదులు ఉప్పొంగి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. చమోలి జిల్లాలోని తపోవన్‌ ప్రాంతం రేని గ్రామం సమీపంలోని రుషి గంగ పవర్‌ ప్రాజెక్టు దగ్గర ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ధౌలి గంగా నదిలో ఒక్కసారిగా ప్రవాహనం పెరగడంతో డ్యామ్‌ కొట్టుకుపోయింది.

డ్యాం నుంచి నీరు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు.. తపోవన్‌ జలవిద్యుత్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న దాదాపు 150 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది.. ఈ సమాచారం అందుకున్న వెంటనే జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపడుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలో దిగాయి.

మరోవైపు భీకర వరదల ప్రభావంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది.. చమోలి నుంచి హరిద్వార్‌ వరకు ముప్పు పొంచివుందన్న వార్తలతో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పోలీసులు సైతం స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగానే ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధౌలిగంగ నదిలో వరదలతో చమోలి జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నదీ పరివాహక ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అటు... పర్యాటకులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం వచ్చిన మహా వరదల్ని తలుచుకుని భయపడుతున్నారు.

అలకనంద నదిలో ప్రస్తుతం సాధారణ స్థాయికంటే ఒక మీటరు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడిన ప్రధాని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా... సీఎంతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాలుగా సహాయ చర్యలు చేపడుతున్నట్టు అమిత్ షా తెలిపారు.

కేబినెట్‌ సెక్రటేరియట్‌లో సహాయ చర్యల సమీక్ష నిమిత్తం హోంశాఖప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాల డీజీలు పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల నిమిత్తం.. రెండు MI-17తోపాటు.. HAL ధ్రువ్ చాపర్‌ను రంగంలో దిగాయి. అవరమైతే మరిన్ని విమానాలు పంపేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు సిద్ధమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story