Vaccine Shortage : దేశంలో టీకా రాజకీయం.. వ్యాక్సిన్ల కొరత ఎంతవరకు నిజం?

Vaccine Shortage

Vaccine Shortage 

Vaccine Shortage :కరోనా టీకా చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. ఒకవైపు కేంద్రం టీకా ఉత్సవ్‌కు రెడీ అయింది. మరోవైపు కేంద్రం..

విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతిపై..

Vaccine Shortage :కరోనా టీకా చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. ఒకవైపు కేంద్రం టీకా ఉత్సవ్‌కు రెడీ అయింది. మరోవైపు కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. విదేశాలను వ్యాక్సిన్ ఎగుమతులను ఆపాలని కోరారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల తీరుపై కేంద్రం మండిపడింది. పలు రాష్ట్రాల్లో స్టాక్ పూర్తికావచ్చింది. వ్యాక్సిన్ తయారీ విషయంలో ఉత్పత్తి కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ఇంకోవైపు వ్యాక్సిన్ (Vaccine Shortage) తయారీకి అవసరమైన ముడిసరుకుల కొరత ముంచుకొస్తోంది. మరి కరోనా వ్యాక్సిన్ పరిస్థితేంటి?

వ్యాక్సిన్ ఉత్సవం వల్ల

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. అయినాసరే టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అంటోంది కేంద్రం. 45 ఏళ్లు పైబడినవారు టీకా కచ్చితంగా తీసుకోవాలంటోంది. అంతేకాదు ఈనెల 11 నుంచి 14 తేదీల మధ్య వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించి, అందరికీ టీకాలు అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి వందమంది సిబ్బంది ఉంటే చాలు ఆఫీసుల్లోనే టీకాలు వేయనున్నారు. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33 లక్షల 37 వేల మందికి టీకా వేయడం విశేషం.

వ్యాక్సిన్ల కొరతలో నిజమెంత?

మరోవైపు వ్యాక్సిన్ కొరత ఏర్పడనుందనే ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదని కేంద్రం కొట్టిపారేస్తున్నా... ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిషా, హర్యానా వంటి రాష్ట్రాల్లో స్టాక్ తగ్గిపోయింది. ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రానికి ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌లు పంపాయి. అటు విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిని ఆపాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని ఆయన మోదీని కోరారు.

టీకాల కొనుగోలు బడ్జెట్ రెట్టింపు చేయాలి

మన దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్లు కావాలంటూ పలు రాష్ట్రాలు పదే పదే కేంద్రాన్ని కోరినా ఫలితం లేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు. టీకా ఎగుమతులపై వెంటనే మారటోరియం విధించాలన్నారు. ఇక టీకాల కొనుగోలు కోసం కేటాయించిన 35 వేల కోట్ల బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని రాహుల్ గాంధీ కోరారు.

రాష్ట్రాల్లో టీకా స్టాకుల కొరత

ఇక టీకా ఉత్సవ్‌ను నిర్వహించడానికి రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ముగియడంతో వ్యాక్సిన్ పంపిణీపై దృష్టిపెట్టాలన్నారు. కానీ తమ రాష్ట్రంలో టీకా స్టాక్ అయిపోయిందని... కోటి డోసులు కావాలని ఏపీ అధికారులు కేంద్రాన్ని కోరారు. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో స్టాక్ పూర్తిగా అయిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోనైతే టీకా కొరతతో ఏకంగా వ్యాక్సిన్ కేంద్రాలనే మూసేయాల్సి రావచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించడంపై కేంద్రం సీరియస్ అయింది. మహారాష్ట్ర సర్కారు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ మండిపడ్డారు. 18 ఏళ్లపైబడినవారందరికీ టీకాలు వేయాలని మహా సర్కారు కోరడాన్ని కూడా కేంద్రం తప్పుబట్టింది.

కొత్త కంపెనీల టీకాలు ఎప్పటికి సిద్ధం?

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ వల్ల టీకా ఉత్పత్తి సంస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. సీరం ఇనిస్టిట్యూట్ ప్రస్తుతం ప్రతి నెలా 6 కోట్ల 50 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులనే ఉత్పత్తి చేస్తోంది. అయితే వచ్చే జూన్ నెలకల్లా 11 కోట్లకు పెంచుతామని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. కానీ ఇందుకోసం 3 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. కోవిషీల్డ్‌తోపాటు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నోవావాక్స్‌ కంపెనీ సహకారంతో కొవోవాక్స్‌ టీకాను మార్కెట్లోకి తేవాలని భావిస్తోంది. ఇక భారత్ బయోటెక్ 70 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఈ ఏడాది చివరినాటికి ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీంతోపాటు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇటు అనుమతులు లభించిన వెంటనే 10 కోట్ల స్పుత్నిక్‌ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సిద్ధమవుతోంది. మరోవైపు దాదాపు 45 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేయడానికి అరబిందో ఫార్మా అమెరికాకు చెందిన కోవాక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని కంపెనీల లక్ష్యం చూస్తే దాదాపు 120 కోట్ల డోసులు అవుతాయి.

ముడిసరుకు కొరత తీరేదెలా?

మరోవైపు టీకా ఉత్పత్తికి కావల్సిన ముడిసరుకు కూడా పెద్ద సమస్యగా మారింది. ముడిసరుకును ప్రస్తుతం మనదేశంలోని సీరం, భారతీయ బయోటెక్ సంస్థలు... అమెరికా, బ్రిటన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ తమ దేశాలకు కూడా టీకాల అవసరం ఎక్కువగా ఉందని... ముడిసరుకును ఇవ్వబోమని ఈ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో ముడిసరును ఎలా సమకూర్చుకోవాలా అని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు తలపట్టుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story