Weather: ఈసారి ఎండలు సెగలు పొగలే..

Weather: ఈసారి ఎండలు సెగలు పొగలే..
150 ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు

ఇప్పటికే ఎండలు ఎక్సలేటర్‌ తొక్కాయి. తెగ చెమటలు కక్కిస్తున్నాయి, ఇక టాప్‌ గేర్‌ వేసి ప్రాణాలు తోడేయడం ఖాయమట. ఈసారి మార్చి నెలలోనే వడగాడ్పులు ప్రారంభమవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు పట్టపగలే వణుకు పుట్టిస్తున్నాయి. 1817 తరువాత... అంటే గడచిన 150 ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరిస్థితి భయంకరంగా ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు. దక్షిణాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణ, రాయలసీమలో నమోదు అవుతాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కయ్‌నెట్‌ పేర్కొంది. రాయలసీమలో ఈ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటే ఛాన్స్‌ ఉందంటోంది. తెలంగాణలో కూడా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయిన స్కయ్‌నెట్‌ హెచ్చరించింది.

ఈసారి ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అధికంగా ఉంటుందని స్కయ్‌మెట్‌ చెబుతోంది. ముఖ్యంగా విదర్భలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తోంది. పొరుగున ఉన్న ఒడిషా తీర ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగే ఛాన్స్‌ ఉందట. ఉత్తరాదిలో చూసుకుంటే.. ఈసారి గుజరాత్‌లో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముంది. గుజరాత్ సెంట్రల్‌ కూడా మండిపోనుంది.

ఎల్‌నినో వచ్చిన ప్రతిసారీ రుతుపవనాలపై ప్రభావం ఉంటోంది. ఎల్‌నినో వచ్చిన 80 శాతం సందర్భాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఈ ప్రభావం 60 శాతం సందర్భాల్లో... కరువు వచ్చిందని స్కయ్‌మెట్‌ పేర్కొంది. సాధారణ వర్షపాతంలో 90 శాతం వర్షపాతం నమోదు అయినా... కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయని చెబుతోంది. మార్చి నెలాఖరుకల్లా రుతుపవనాలపై ఒక అంచనాకు రావొచ్చని తెలుస్తోంది.

మొత్తానికి ఫిబ్రవరిలోనే 150 ఏళ్ల కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం... మార్చిలోనే వడగాడ్పులు ప్రారంభమవుతాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు తాటుతాయన్న హెచ్చరికలు ఆందోళన కల్గించేవే.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎండలకు అడ్డంగా బలికాక తప్పని పరిస్థితి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story