Weather: నిప్పులు కురిపిస్తున్న భానుడు

Weather: నిప్పులు కురిపిస్తున్న భానుడు
ఏపీ,తెలంగాణలో నిప్పుల వర్షాన్ని తలపిస్తున్న ఎండలు

సూర్యుడు నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే చుక్కలు చూపిస్తున్నాడు. రోహిణిలో పగలాల్సిన రోళ్లు...ఇప్పుడే పగులుతున్నాయి. మొత్తంమీద ఏపీ,తెలంగాణలో ఎండలు నిప్పుల వర్షాన్ని తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. ఎండల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. మేలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుంది.సాధారణం కన్నా మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు.మార్చి నెల మొదట్లోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో ప్రజలు సెగ, ఉక్కపోతతో ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాధారణం కన్నా 5నుంచి 9డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా.. మైదాన ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.చాలా చోట్ల గాలిలో తేమ శాతం పడిపోతుంది.ఇలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు పగలు ఎండలో తిరగొద్దని.. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు, ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు తోడయ్యాయి.ఉక్కపోత నరకం చూపిస్తోంది.ఇక పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం పదిన్నర నుంచే ఎండ ప్రభావం కనిపిస్తుండగా ఇంచుమించు సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రత కొనసాగుతోంది.ఐదు గంటలకు కూడా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి మొదటివారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక నిండు వేసవిలో ఏ స్థాయిలో ఎండ ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఈసారి ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అధికంగా ఉంటుందని స్కయ్‌మెట్‌ చెబుతోంది. ముఖ్యంగా ఒడిషా తీర ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగే ఛాన్స్‌ ఉందట.ఎల్‌నినో వచ్చిన ప్రతిసారీ రుతుపవనాలపై ప్రభావం ఉంటోంది. ఎల్‌నినో వచ్చిన 80 శాతం సందర్భాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఈ ప్రభావం 60 శాతం సందర్భాల్లో... కరువు వచ్చిందని స్కయ్‌మెట్‌ పేర్కొంది. సాధారణ వర్షపాతంలో 90 శాతం వర్షపాతం నమోదు అయినా... కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయని చెబుతోంది. మార్చి నెలాఖరుకల్లా రుతుపవనాలపై ఒక అంచనాకు రావొచ్చని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story