Maoist RK : అలిపిరిలో చంద్రబాబు పై దాడి.. వైఎస్‌ హయాంలో శాంతి చర్చలు.. ఆర్కే బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?

Maoist RK : అలిపిరిలో చంద్రబాబు పై దాడి.. వైఎస్‌ హయాంలో శాంతి చర్చలు.. ఆర్కే బ్యాక్‌‌గ్రౌండ్ ఏంటి?
Maoist RK : మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత అయిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కన్నుమూశారు.

Maoist RK : మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత అయిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే కన్నుమూశారు. ఆయన మరణవార్తను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు. సుకుమా-బీజాపూర్‌ అడవుల్లో అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఐతే.. మావోయిస్టు పార్టీ దీన్ని అధిరికంగా చెప్పడం లేదు. స్థానికంగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కే అనారోగ్యంతో మరణించడంతో ఆయన అంతిమ సంస్కారాల్ని కూడా పూర్తి చేశారు.

అంతు చిక్కని వ్యాధి వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు మావోయిస్టు సానుభూతిపరులు చెప్తున్నారు. లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో చనిపోయినట్టు తెలుస్తోంది. పార్టీలో ముఖ్యులు అజ్ఞాతంలో ఉండగా మరణిస్తే.. పార్టీనే వారి అంత్యక్రియలు పూర్తి చేసే సంప్రదాయం ఉందని.. ఆర్కే అంత్యక్రియలు కూడా ఇలాగే పూర్తి చేశారని తెలుస్తోంది. ఐతే.. ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఆర్కే మరణంపై పోలీసుల నుంచి కానీ, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే చనిపోయారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చాలా కాలంగా ఆయన ఆ ప్రాంతం నుంచే తన వ్యూహరచన అమలు చేస్తున్నారు. ఆర్కేపై ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 85 కేసులు ఉన్నాయి. 200 మంది పోలీసుల మృతికి కారకుడిగా ఆయనపై అభియోగాలున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన దాడి కేసులోనూ ఆర్కే పాత్ర ఉంది. ఆయన తలపై 50 లక్షల రివార్డ్‌ ఉంది.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004 అక్టోబర్‌లో నక్సల్స్‌తో శాంతి చర్చలు జరిపిన సందర్భంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత చర్చలు విఫలం అవడం, వరుసగా మావోయిస్టుల ఏరివేతతో ఆర్కే సహా ముఖ్యనేతలంతా ఎక్కడున్నారనే సమాచారం చాలా సీక్రెట్‌గా ఉంచారు. నాలుగేళ్ల క్రితం AOBలో జరిగిన ఎదురుకాల్పుల్లో RK తృటిలో తప్పించుకున్నారు. నాడు ఆయనకు బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి. మరికొన్ని సందర్భాల్లోనూ పోలీసుల కూబింగ్‌ నుంచి, ఎదురుకాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 2004 టైమ్‌లోనే వివిధ రాష్ట్రాల్లోని విప్లవకారులంతా కలిసి మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డంలోనూ ఆర్కే లాంటి వారి పాత్ర ప్రముఖంగానే ఉంది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమ్రుకోట ఆర్కే స్వస్థలం. ఆయన కుమారుడు ఉద్యమంలోనే కొన్నేళ్ల కిందట ప్రాణాలు వదిలాడు.

సుదీర్ఘకాలంగా అంటే దాదాపు 35 ఏళ్లకుపైగా మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. ఆయన లైఫ్‌లో సగం జీవితం అజ్ఞాతంలోనే గడిచిపోయింది. విద్యార్థి జీవితం తర్వాత విప్లవ ఉద్యమంవైపు అడుగులు వేసిన ఆర్కే.. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. 80-90 దశకాల్లో బలంగా కనిపించిన పీపుల్స్‌వార్‌తో తన ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన ఆర్కే.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగేవరకూ ఎన్నో సవాళ్లను చూశారు. జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి నుంచి కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. ఆయనది గుంటూరు జిల్లా. మావోయిస్టు నేతగా ఆయన్ను టార్గెట్ చేస్తూనే అనేక సార్లు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story