ఏమ్మా మా ఆయన కావాలా.. అయితే ఓ అయిదు లక్షలిచ్చుకో.. 'శుభలగ్నం' సినిమా రిపీట్

ఏమ్మా మా ఆయన కావాలా.. అయితే ఓ అయిదు లక్షలిచ్చుకో.. శుభలగ్నం సినిమా రిపీట్
ఇలాంటి సీన్లు నిజంగా నిజ జీవితంలో జరుగుతాయా అంటే.. ఏమోనమ్మా కలికాలం ఏమైనా జరగొచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు.

సినిమాలో ఆమనికి డబ్బు పిచ్చి పట్టి కట్టుకున్న పతిని మరో సతికి బేరం పెడుతుంది.. ఆ సినిమా అప్పట్లో కాసులు కురిపించింది.. ఆమని, జగపతిబాబు, రోజా వారి పాత్రల్లో జీవించారు. ఇలాంటి సీన్లు నిజంగా నిజ జీవితంలో జరుగుతాయా అంటే.. ఏమోనమ్మా కలికాలం ఏమైనా జరగొచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు వీళ్ల విషయం తెలిసిన వారు.

ఇంట్లో భార్యా, పిల్లలు ఉన్నారు.. అయినా మరొకామెపై మనసు పారేసుకున్నాడు కర్ణాటక మాండ్యా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి. ఆమె వద్ద రూ.5 లక్షలు అప్పు కూడా చేశాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా అడిగినప్పుడల్లా ఇస్తానంటూ దాటవేస్తున్నాడు. సరేలే డబ్బివ్వకపోయినా పర్లేదు.. నేను పిలిచినప్పుడల్లా వచ్చేయమంటూ ఓ బంపరాఫర్ ఇచ్చింది. ఇదే ఛాన్స్ అంటూ అదే పని మీద ఉంటున్నాడు జల్సా రాయుడు. భర్తగారి బాగోతం అంతా భార్యకి తెలిసింది.

ఓరోజు ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఊరి పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టింది. తన భర్తను ఆమె నుంచి విడిపించాలని పెద్దలను కోరింది. అయితే అతడిని వాడుకుంటున్న మహిళ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. అతడు తన నుంచి రూ.5 లక్షలు అప్పు చేశాడని, అది చెల్లించి భర్తను తీసుకెళ్లాలని తెగేసి చెప్పింది. దీంతో అతడి భార్యకు చిర్రెత్తుకొచ్చింది. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్న భర్త తనకు వద్దని తెగేసి చెప్పింది. విడాకులు ఇస్తాను. కానీ తాను బతికేందుకు భరణం కావాలని కోరింది.

అందివచ్చిన ఆఫర్ ను వదులుకోకూడదనుకున్న సదరు మహిళ.. నీ భర్తను, నీ తాళి బొట్టును నాకిస్తే.. నేనే నీకు రూ.5 లక్షలు ఇస్తా అని గ్రామ పెద్దల ముందు బేరం కుదుర్చుకుంది. కధ సుఖాంతం అవడంతో భర్తని ఆమెకు అప్పగించి.. రూ.5 లక్షలు తీసుకుని ఆమె వెళ్లి పోయింది. ఈ సంఘటన కరోనా సీజన్ కి ముందే జరిగింది. ఇప్పుడు వెలుగు చూసింది.

Tags

Read MoreRead Less
Next Story