పలువురు ప్రముఖులు.. రూ.350 కోట్ల పన్ను చెల్లించలేదు: ఐటీ శాఖ అధికారులు

పలువురు ప్రముఖులు.. రూ.350 కోట్ల పన్ను చెల్లించలేదు: ఐటీ శాఖ అధికారులు
సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న పలువురు ప్రముఖులు పన్ను చెల్లించలేదు. ఐటీ శాఖ దాడుల అనంతరం వారి బండారం బయటపడింది.

సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న పలువురు ప్రముఖులు పన్ను చెల్లించలేదు. ఐటీ శాఖ దాడుల అనంతరం వారి బండారం బయటపడింది. కోట్లలో సంపాదన ఉన్నా, సమాజానికి ఏదో చెప్పాలనే ధోరణిలో సినిమాలు తీస్తున్నా.. దేశంలోని ప్రతి పౌరుడు సక్రమంగా పన్ను కడితే పేదరిక నిర్మూలన పెద్ద కష్టమేం కాదని తెలిసినా పన్నుఎగవేస్తుంటారు.. వార్తల్లో నిలుస్తుంటారు.

బాలీవుడ్‌లో ఐటీశాఖ దాడులు దుమారం రేపుతోంది. బాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ వార్‌గా మలుపులు తిరుగుతోంది. ఐటీ దాడులను సర్వసాధారణమని నిర్మలా సీతారామన్ చెప్పగా.. అందుకు ఆర్థిక మంత్రికే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది నటి తాప్సి. ఏకకాలంలో పలుచోట్ల వరుస సోదాలు జరుగడంతో ఐటీ దాడులు బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇంతకీ ఐటీ దాడుల్లో అధికారులకు ఆధారాలు లభించాయా..? మోడీ సర్కారును విమర్శించినందుకే తాప్సి,కశ్యప్ పైనా కక్ష కట్టారా..? అందుకే కావాలనే ఐటీశాఖను వారిపై ఉసిగొల్పారా..? ఇంత ప్రకంపనలు రేపుతున్నా బాలీవుడ్ బాద్‌ షాలు, ఇతర ప్రముఖులు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదు..?

మూడు రోజులుగా బాలీవుడ్‌లో జరుగుతున్న ఐటీశాఖ సోదాలు ప్రకంపనలు రేపుతున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్సితో పాటు పలువురు ఇళ్లు, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అనురాగ్‌కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్‌ సంస్థలో భారీగా అక్రమాలు జరిగాయని, ఉద్ధేశ్యపూర్వకంగానే పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఐటీ శాఖ దాడులకు దిగింది.

తమ దాడుల్లో ఫాంటమ్ సంస్థ చూపిన ఆదాయానికి.. బాక్సాఫీస్ వసూళ్లకు మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. సుమారు 300 కోట్ల తేడాను కశ్యప్ నేతృత్వంలోని ఫాంటమ్ సంస్థ అధికారులు వివరించలేదన్నారు. 350 కోట్ల రూపాయల పన్ను చెల్లించలేదని చెప్పారు. నటి తాప్సి దాదాపు 5 కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించిన క్యాష్ రషీదులు తాము స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో సోదాలపై విమర్శలు రావడంతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఐటీ దాడులను సర్వసాధారణమని అభివర్ణించారు. 2013లోను తాప్సితో పాటు పలువురు సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయని.. కానీ అది అప్పుడు సమస్య కాలేదని.. ఇప్పుడు మాత్రం పెద్ద దేశ సమస్యగా చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారి ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారన్న విమర్శలను నిర్మలా కొట్టిపారేశారు.

దీనికి నటి తాప్సి.. ఆర్థిక మంత్రికి ట్విట్టర్ ద్వారా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ట్వీట్లలో 2013 నాటి ఐటీ దాడుల విషయాన్ని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ నిర్మలా సీతారామన్‌కు కౌంటర్ ఇచ్చింది. మరోవైపు మోడీ సర్కారును తాప్సి విమర్శించినందుకే వారి సంస్థపైన ఐటీ దాడులు చేయిస్తున్నారని బీటౌన్‌లో గట్టిగా వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story