మహేంద్ర సింగ్ ధోని తరచు సందర్శించే పురాతన ఆలయం ప్రత్యేకత..

మహేంద్ర సింగ్ ధోని తరచు సందర్శించే పురాతన ఆలయం ప్రత్యేకత..
ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా చాలా కూల్ గా కనిపిస్తాడు.. అందుకే క్రికెట్ అభిమానులు అతడిని మిస్టర్ కూల్ అని పిలుస్తారు.

క్రికెట్ ప్రపంచంలో ప్రకాశవంతమైన స్టార్ మహి.. మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు మహి మంచి నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసించిన వారు కొందరైతే, నిరాశకు గురయ్యారు మరికొందరు. అటు గ్రౌండ్ లో కాని ఇటు బయట కానీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా చాలా కూల్ కనిపిస్తాడు.. అందుకే అశేష క్రికెట్ అభిమానులు అతడిని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోనిలో కనిపించని మరో కోణం ఆధ్యాత్మికత. రాంచీలోని 700 సంవత్సరాల నాటి పురాతన దేవోరి ఆలయాన్ని ధోని తరచూ సందర్శిస్తుంటాడు. ఈ గుడితో మహీకి విడదీయరాని అనుబంధం ఉంది.

దేవోరి మాత ఆలయం ఝార్ఖండ్ రాష్ట్ర రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంచీ-టాటా హైవేపై ఉంది. ఈ ఆలయంలో దుర్గామాత కొలువుదీరి ఉంటుంది. సాధారణంగా దుర్గామాతకు 8 చేతులు ఉంటాయి ఎక్కడి విగ్రహానికైనా. కానీ దేవోరి మాత ఆలయంలో 18 చేతులతో దుర్గమ్మ సాక్షాత్కరిస్తుంది. ఈ మందిరాన్ని మహీ ఏ మాత్రం ఖాళీ దొరికినా ఖచ్చితంగా సందర్శిస్తుంటాడు. విదేశీ పర్యటనలకు వెళ్లేముందు మాత ఆశీర్వాదం పొందుతాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం వెంటనే రాంచీ చేరుకుని దేవోరి మాతను దర్శించుకున్నాడు.

ఈ మందిరంలో దుర్గామాత విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తుండి 16 చేతులతో దర్శనమిస్తుంది. క్రీ.శ 1300లో సింహభూమికి చెందిన ముండా రాజు కేరా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. ఆలయంలో దేవోరి మాతను ప్రతిష్టించి కొలిచిన తర్వాతే తన సింహాసనాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం. కళింగ యుద్ధం సమయంలో అశోకుడు ఈ మందిరాన్ని నిర్మించాడని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.

ఇక్కడ పూజా విధానం కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఝార్ఖండ్ లోని గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇక్కడి పూజా విధానం ఉంటుంది. ఆదివాసీలు వారానికి 6 రోజులు పూజ చేస్తారు. మిగిలిన ఒక్కరోజు మాత్రమే బ్రాహ్మణులకు అవకాశం ఉంటుంది. ఇంతటి చరిత్ర కలిగిన దేవోరి మాతను పూజిస్తే జీవితంలో ఎలాంటి అవరోధాలు, ఆర్థిక సమస్యలు రావని భక్తులు విశ్వసిస్తారు. దేవీ నవరాత్రులకు భక్తులు అసంఖ్యాకంగా ఆలయాన్ని సందర్శిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story