Ayman al-Zawahri: అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీ హతం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన..

Ayman al-Zawahri: అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీ హతం.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన..
Ayman al-Zawahri:అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ప్రతీసారి తను చనిపోయాడంటూ అల్‌ఖైదా అబద్దాలు ఆడింది

Ayman al-Zawahri: అల్‌-ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ప్రతీసారి జవహరీ చనిపోయాడంటూ అల్‌ఖైదా అబద్దాలు ఆడుతూ వచ్చింది. ఈసారి ఆ అబద్దాన్ని నిజం చేసింది అమెరికా. స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. జవహరీ మృతిని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఏడున్నరకు.. జవహరీని అంతమొందించినట్టు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రతినిధి ముజాహిద్ సైతం జవహరీ మృతిని ధృవీకరించారు. జవహరీ కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్న అమెరికా.. చాలా సైలెంట్‌గా ఈ ఆపరేషన్ చేపట్టింది.

డ్రోన్‌ సాయంతో జవహరీ కదలికలను పసిగట్టింది. ఆఫ్ఘాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అల్‌ జవహరీ బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. కొంతకాలంగా పక్కా సమాచారంతో నిఘా పెట్టిన అమెరికా బలగాలు.. ఆఫ్ఘనిస్తాన్‌లోని షెర్పూర్ ప్రాంతంలో జవహరీ నివసిస్తున్నట్టు నిర్దారించుకున్నాయి. 71 ఏళ్ల అల్‌ జవహరీ.. షెర్పూర్‌లోని ఓ బంగ్లాలో తన భార్య, మనవరాళ్లతో ఉంటున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటి బాల్కనీలో.. తన అనుచరులతో జవహరీ సమావేశం ఏర్పాటు చేశాడు. అదును కోసం చూస్తున్న అమెరికా.. అక్కడికక్కడే డ్రోన్‌ సాయంతో బాంబులు విసిరింది.

ఈ దాడిలో అప్‌ జవహరీ చనిపోయాడు. చుట్టుపక్కల వారికి గాని, మరే ఇతర ప్రాణనష్టం గాని జరగలేదని అమెరికా చెబుతోంది. అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ.. ఈ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ చేస్తున్నట్టు ఆఫ్ఘాన్‌ తాలిబన్ ప్రభుత్వానికి చెప్పలేదు. అక్కడి నాయకత్వానికి ఈ ఆపరేషన్‌ గురించి తెలియకుండా జాగ్రత్తపడింది. బాల్కనీలో కొంతమంది అనుచరులతో మాట్లాడుతుండగా డ్రోన్లతో దాడులు చేసింది. ఆఫ్ఘాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తరువాత.. అమెరికా చేపట్టిన ప్రధాన ఆపరేషన్‌ ఇదే.

అల్‌ జవహరీ ఒక ఈజిప్షియన్. ఈజిప్టులో జనరల్‌ సర్జన్‌గా పనిచేసేవాడు. కాని, ఉగ్రవాదం వైపు అడుగులు వేసి.. ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థను నెలకొల్పాడు. 1990లో తన ఉగ్రవాద సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. ఒసామా బిన్‌ లాడెన్‌కు వ్యక్తిగత ఫిజిషియన్‌గా సేవలందించాడు. లాడెన్‌ నేతృత్వంలో 1998లో టాంజానియా, కెన్యాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులు జరిపించాడు. ప్రధానంగా 2001 సెప్టెంబర్‌ 11న అమెరికా వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌పై దాడిలో ప్రధాన సూత్రధారుడిగా ఉన్నాడు.

9/11 దాడిలో 3వేల మందిని అమెరికన్లను పొట్టనపెట్టుకున్నందున.. అల్‌-జవహరీని ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా చేర్చింది అమెరికా. 2011లో అమెరికా దళాలు ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన తర్వాత.. అల్‌ జవహరీనే అల్‌-ఖైదా పగ్గాలు స్వీకరించాడు. అప్పటికే జవహరీ తలపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది అమెరికా. జవహరీని చంపడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా ఫోకస్‌ జవహరీ నుంచి తప్పించడానికి.. అనారోగ్య కారణాలతో జవహరీ చనిపోయినట్లు అల్‌ఖైదా ప్రచారం చేసింది.

ఆ ప్రచారం నిజమేనని అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ధృవీకరించుకుంది. అయితే, కొన్నాళ్లకు అమెరికా ఇంటెలిజెన్స్‌కే షాక్‌ ఇస్తూ జవహరీ ప్రసంగం వీడియో విడుదలైంది. జీహాదీ గ్రూపులపైనా, వారి వెబ్‌సైట్లపైనా 24 గంటలూ కన్నేసి ఉంచే నైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్‌.. జవహరీ వీడియో చూసి షాక్‌ అయింది. అప్పటి నుంచి జవహరీని స్వయంగా మట్టుబెట్టిన తరువాతే ప్రకటన చేయాలనే కసితో పనిచేసింది అమెరికా ఇంటెలిజెన్స్‌. అలా ఇన్నాళ్లకు తన ఆపరేషన్‌ను సక్సెస్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story