మళ్లీ రెండోసారి కూడానా.. కరోనా

మళ్లీ రెండోసారి కూడానా.. కరోనా
తెలిసిన వారికి చాలా మందికి వస్తుంది.. మనకి కూడా వస్తుందేమో అని అనుకునేలోపే వైరస్ బారిన పడుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని

తెలిసిన వారికి చాలా మందికి వస్తుంది.. మనకి కూడా వస్తుందేమో అని అనుకునేలోపే వైరస్ బారిన పడుతున్నారు. జాగ్రత్తలు తీసుకుని, డాక్టర్ పర్యవేక్షలో చికిత్స తీసుకుని, హోం క్వారంటైన్ లో ఉండి.. హమ్మయ్యా కరోనా తగ్గింది అని ఊపిరి పీల్చుకోవడానికి లేదనే చెబుతున్నాయి హాంకాంగ్ అధ్యయనాలు.. మళ్లీ వస్తుందనే వార్త మింగుడు పడనివ్వట్లేదు. తాజా అధ్యయనాల ప్రకారం ఎక్కువగా డాక్టర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రెండోసారి కరోనా సోకితే కోలుకోవడానికి కనీసం 20 రోజులు పడుతోంది. లక్షణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. వీరిలో ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు, న్యుమోనియా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో వైరస్ ఉండి మళ్లీ తిరగబెడుతోందా అనే అంశాన్ని పరిశీలించవలసి ఉందంటున్నారు పల్మనాలజిస్టులు.

హాంకాంగ్ లో 33 ఏళ్ల వ్యక్తికి కరోనా రెండోసారి సోకిందని.. ఆ వైరస్ రీఇన్ఫెక్షన్ కు సంబంధించి ఇది ప్రపంచంలోనే పూర్తిస్థాయి వివరాలు నమోదు చేసిన కేసు అని హాంకాంగ్ వర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. అయితే ఇలా రెండోసారి వైరస్ బారిన పడిన కేసులు చాలానే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒకరికి రెండోసారి వైరస్ సోకినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించడం గమనార్హం. ఈ రీ-ఇన్ఫెక్షన్ల బెడద కొద్దిరోజుల క్రితమే మొదలైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే సాధారణ ప్రజలెవరూ ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఒకసారి వచ్చింది కదా.. మళ్లీ రాదులే అన్న భావనలో ఉండకూడదంటున్నారు వైద్య నిపుణులు. రెండోసారి వైరస్ బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటున్నట్లు వైద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు. రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలుంటే తీవ్రత మరింత అధికంగా ఉంటోందని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనం.. వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరికి రెండోసారి కరోనా సోకి పరిస్థితి విషమించడంతో వైద్యుల పర్యవేక్ష్ణలో ఉన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో నర్సు, గాంధీలోని పలువురు వైద్యులు, నర్సులు, సికింద్రాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో ఆరుగురు నర్పులు రెండోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో వైద్య శాఖలో తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్ సోకిన వ్యక్తులకు రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే వారు కూడా కచ్చితంగా టీకాలు వేయించుకోవాల్సిందేనని హాంకాంగ్ వర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story