తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇరువర్గాల నినాదాలు..

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇరువర్గాల నినాదాలు..

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు ఎమ్మెల్సీల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక కోటా ఎమ్మెల్సీల స్థానాల ఉప ఎన్నిక కోసం ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 9 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . టీఆర్‌ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తుండగా.. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు.

ఓటర్లను ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తాయనే కారణంతో ఎవరికి వారు పోలింగ్‌కు ముందు వరకు క్యాంపు రాజకీయాలు జరిపారు. దీంతో ఓటర్లు క్యాంపు నుంచి నేరుగా బస్సులో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చారు. ఉమ్మడి వరంగల్‌లో ఎంపీలు పసునూరి దయాకర్‌, బండ ప్రకాశ్‌, కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్‌, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కోదాడలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఓటు వేశారు.

అటు నల్గొండ క్లాక్‌టవర్‌ కూడలిలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్‌రెడ్డి తారసపడడంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు కార్యకర్తల్ని చెదరగొట్టారు. ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు ఉమ్మడి నల్గొండ ప్రజలు రెండు ఎంపీ స్థానాలలో టీఆర్‌ఎస్‌ను ఓడించి బుద్ధిచెప్పారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలలో గెలుపు ఎవరిదో తెలియాలంటే జూన్‌ 3 వరకు వేచిచూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story