భారీవర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

భారీవర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

ఈశాన్య రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. జోరుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రాలు తడిసిముద్ద అవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో కుండపోత వానలకు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. బహ్మపుత్ర, దాని ఉప నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపంతో అసోంలో సుమారు 1556 గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. 21 జిల్లాలో 8 లక్షలకుపైగా ప్రజలపై ప్రభావం చూపగా ఒక్క బార్పేటలోనే సుమారు 4లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. బస్కా జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలను చేపడుతుంది. వరదల కారణంగా ఇప్పటి వరకు అసోంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తుంది.

అసోంలో సహాయక చర్యలకు జాతీయ, రాష్ట్రీయ విపత్తు సహాయక దళాలు మోహరించాయి. వీరితోపాటు ఆర్మీ సహాయాన్ని కోరినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వరదలకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తుంది. వర్షాలతో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు వనికిపోతుండగా..ఇవాళ కూడా 13 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయాల సమీపంలోని సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story