ఆ సరస్సు నీరు తాగితే చనిపోతున్న పక్షులు

ఆ సరస్సు నీరు తాగితే చనిపోతున్న పక్షులు

కొల్లేరు సరస్సు! ఇది ప్రపంచ ప్రసిద్దమైన మంచినీటి సరస్సు. 2లక్షల ఎకరాలకు పైగా విస్తరించిన సహజసిద్ద సరస్సు ఇది.. దీని అందం గురించి ఒకప్పుడు పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు లో రకరకాల చేపలు, కలువలతో ఎంతో అందంగా ఉండేది. ఇక్కడ చేపల్ని తినేందుకు.. దేశవిదేశాల నుంచి 200 రకాల పక్షులు వచ్చేవి. ఇక్కడే ఉండి పునరుత్పత్తి చేసుకుని తిరిగి స్వదేశాలకు వెళ్లేవి. వీటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేవారు. దీంతో టూరిజం కూడా పెరిగింది. ఇక ఇక్కడుండే మత్స్యకారులు ఈ చెరువునీళ్లనే తాగేవాళ్లు.

ఇదంతా గతం. ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. 15ఏళ్ల క్రితం వరకు కళకళలాడే కొల్లేరులో అక్రమార్కుల చేపల చెరువులు, రొయ్యల చెరువులతో.. ఈ చెరువు ఎడారిగా మారిపోయింది. పరిశ్రమలు నుంచి వచ్చే 61 మురుగు డ్రైన్ల ద్వారా వ్యర్ధపు నీరంతా ఈ చెరువులో చేరుతోంది. దీంతో ఈ చెరువు కాలుష్యమైపోయింది. చేపలు, రొయ్యల చెరువుల కారణంగా భారీగా రసాయనాలు వాడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే పక్షులు చనిపోతున్నాయి. ప్రస్తుతం నీటికుంటలుగా మిగిలిన కొల్లేరులో ఉన్న కాస్త నీరు కలుషితమైపోయింది. మొత్తం 14 రకాల కలుషిత రసాయనాలు ఇందులో కలుస్తున్నాయని తాజాగా కొల్లేరుపై అధ్యయనం చేసిన పర్యావరణ బృందం వెల్లడించింది. ఈ రసాయనాల వల్లే... పక్షులు చనిపోతున్నాయని ఈ టీం తెలిపింది. అంతేకాదు పశువులు అంతుచిక్కని రోగాల పాలవుతున్నాయని తెలిపింది.

కొల్లేరులో అక్రమ చెరువల తో మొదలైన కాలుష్యం... ఇప్పుడు ఇక్కడి చెరువునంతా ఆక్రమించేసింది.ప్రస్తుతం ఇక్కడ పక్షులు మనుగడ సాగించడం కష్టమే. పక్షులకే కాదు మనుషులకు కూడా ఇక్కడి నీరు ఏవిధంగానూ ఉపయోగ పడటం లేదు. మంచినీటి సరస్సు తమ మధ్యలో ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చెరువు చుట్టుపక్కల ఉండే మత్య్సకార కుటుంబాలు.. కిలోమీటర్లు వెళ్లి ..తాగే నీళ్లు కొంటున్నారు. చిత్తడి నేలలను, పర్యావరణాన్ని, వణ్యప్రాణి అభయారణ్యాన్ని జాతీయ స్థాయిలో కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ చెరువుపై దృష్టి సారించాలని కోరుతున్నారు స్థానికులు. కొల్లేరును కాపాడాలని.. పక్షులు, వణ్యప్రాణులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story