అనాధగా పుట్టి.. గజ ఈతగాడిగా మారి 107 మంది ప్రాణాలను..

అనాధగా పుట్టి.. గజ ఈతగాడిగా మారి 107 మంది ప్రాణాలను..

అమ్మానాన్న ఎవరో తెలియదు.. అయిదేళ్ల వయసున్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు.. అయిన వాళ్లెవరూ లేరు.. ఆదరించే వారు లేరు.. పుట్‌పాత్‌ మీదే పడుకున్న తనను పూల వ్యాపారం చేసుకునే మల్లేశ్వరమ్మ అనే ఓ తల్లి చేరదీసింది. తనకొడుకుతో సమానంగా పెంచి పెద్ద చేసింది.. శివ అని పేరు పెట్టింది. ఓ రోజు తమ్ముడు చెరువులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. అమ్మ తమ్ముడిని ఆస్థితిలో చూసి కన్నీరు మున్నీరైంది. దాంతో శివ అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇలా ఈత రాక ప్రాణాలు కోల్పోయే వారు కొందరైతే.. చిన్న చిన్న కారణాలకే నీళ్లలో దూకి ప్రాణాలు పోగొట్టుకునేవారు మరి కొందరు. ఇలాంటి వారిని ఆదుకోవాలని అనుకున్నాడు. అందుకే ఈత నేర్చుకోవడం మొదలు పెట్టాడు.

గజ ఈతగాడుగా మారి ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్‌లో దూకిన 107 మంది వ్యక్తుల ప్రాణాలు కాపాడాడు శివ. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారిని వెలికి తీసి బంధువులకు సమాచారం అందిస్తాడు. ఇందుకు వారిచ్చే కొద్ది మొత్తాన్నే అంటే ప్రాణాలు కాపాడితే రూ.500లు.. మృత దేహాన్ని వెలికి తీస్తే రూ.300లు ఇస్తారు. మరికొంత ఇవ్వమని ఎప్పుడూ ఎవర్నీ డిమాండ్ చేయడు. వారి బాధలో వారు వుంటే ఎక్కువ ఇమ్మని ఎలా అడుగుతాను అని అంటాడు. శివని గురించి తెలుసుకున్న పోలీసులు కూడా అత్యవసర పరిస్థితుల్లో అతడినే సహాయం కోరతారు. ఇందుకుగాను పోలీసులు ఎంతో కొంత ముట్టజెబుతారు. ఆ డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఇద్దరు పిల్లల్ని పోలీసులు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నారు. అప్పుడప్పుడు శివ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తాడు. అది కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆధారమవుతుంది. ప్రస్తుతం ట్యాంక్‌బండ్ శివగా గుర్తింపైతే వచ్చింది కానీ ఉండడానికి ఇల్లు లేదు. హుస్సేన్ సాగర్ పక్కను ఉన్న చిన్న పాడుబడిన కట్టడంలోనే శివ కుటుంబం నివసిస్తోంది.

రాజకీయ నాయకులు, పోలీసులు పెద్దలు హామీలైతే ఇచ్చారు కానీ.. ఆచరణలో మాత్రం శూన్యం అంటాడు శివ. హోమ్ గార్డుగా ఉద్యోగం ఇస్తామని అన్నారు కానీ ఇంతవరకు కార్య రూపం దాల్చలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తనక్కూడా ఇప్పించమని వేడుకుంటున్నాడు. ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు వీలైనంత మంది ప్రాణాలు కాపాడతానంటున్నాడు. తనలా అనాధలుగా ఉన్న వారిని చేరదీసి ఆదుకోవాలని ఉందని అందుకు దేవుడు సహకరిస్తే తప్పకుండా చేస్తానంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story