పాగల్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

పాగల్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Paagal Movie Review: యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కుర్ర హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు.

రివ్యూ : పాగల్

తారాగణం : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘ లేఖ, మురళీశర్మ, భూమిక

సంగీతం : రధన్

సినిమాటోగ్రఫీ : మణికందన్

నిర్మాత : బెక్కెం వేణుగోపాల్

దర్శకత్వం : నరేష్ కుప్పిలి

యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కుర్ర హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. తనదైన యాటిట్యూడ్ తోనే యూత్ ను ఎట్రాక్ట్ చేశాడు. మరోవైపు వైవిధ్యమైన పాత్రలు కూడా ఎంచుకుంటున్నాడు. అలాంటి హీరో పాగల్ అనే టైటిల్ తో 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను అనే ట్రైలర్ డైలాగ్ తో వస్తే ఇంకేముందీ .. ఓపెనింగ్స్ కొదవ లేదు. ఓపెనింగ్స్ వరకూ ఓకే మరి సస్టెయిన్ కావాలంటే కథ, కథనం కదా ఇంపార్టెంట్. మరి ఆ విషయంలో పాగల్ ఎలా ఉన్నాడో చూద్దాం..

కథ :

ప్రేమ్(విశ్వక్) చిన్నప్పుడే తల్లి(భూమిక) చనిపోతుంది. అప్పటికే అతనికి కొండంత ప్రేమను పంచుతుందామే. చనిపోతూ.. అందరినీ ప్రేమించమనే చెబుతుంది. అనాథ అయిన ప్రేమ్ ఆ తర్వాత అమ్మలాంటి అమ్మాయిని వెదుకుతూ టీనేజ్ లోనే కనిపించిన వారికల్లా ఐ లవ్యూ చెబుతూ చెంపదెబ్బలు తింటుంటాడు. ఈ క్రమంలో ఓ బ్రేకప్ అయిన అమ్మాయి చెప్పిన మాట విని బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటాడు. తర్వాత ప్రేమను వెదుక్కుంటూ వైజాగ్ లో వాలతాడు. అక్కడా ముగ్గురిని ప్రేమించినా వారంతా బ్రేకప్ చెబుతారు. చివరగా తను ఓ కాబోయే ఎమ్మెల్యే(మురళీ శర్మ)కి ఐ లవ్యూ చెప్పి.. అతన్నీ తనను ప్రేమించమని వేధిస్తుంటాడు. దీనికంటే ముందు అతను నాలుగో ప్రేమగా తీర(నివేదా పేతురాజ్)ను ప్రేమిస్తాడు. మరి సడెన్ గా ఎమ్మెల్యేతో ప్రేమ ఏంటీ..? తీర కథ ఏ తీరం చేరింది. అసలు ప్రేమ్ కోరుకున్న ప్రేమ దొరికిందా లేదా అనేది కథ.

ఎలా ఉంది :

పాగల్ టైటిల్ కు తగ్గట్టుగా ఉన్న సినిమా కాదు. ఆ మాటకొస్తే టైటిల్ కు సంబంధం లేని సినిమా. ఎక్కువమంది అమ్మాయిలను ప్రేమిస్తే పాగల్ అంటారేమో.. కానీ అతను వెదుకుతున్న ప్రేమలో సిన్సియారిటీ అతని అప్రోచ్ లో ఇన్నోసెన్సీ ఉన్నప్పుడు అతని చర్యలు పాగల్ అనిపించవు. నిజానికి తల్లి ప్రేమతో మొదలై మంచి టేకాఫ్ తీసుకున్న ఈ కథ వైజాగ్ చేరిన తర్వాత రిపీటెడ్ సీన్స్ తో చిరాకు పెట్టిస్తారు. ఒకటీ రెండు అంటే ఫర్వాలేదు. ప్రేమ సీన్, ఫైట్ సీన్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే అందులోనూ ఓ ప్రేమకథ నవ్విస్తుంది. అదే టైమ్ లో మురళీశర్మతో వచ్చే సన్నివేశాలు వీలైనంత ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంటాయి. ఆ ఇరిటేషన్ నుంచి అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు దర్శకుడు.

పెద్ద ట్విస్ట్ తర్వాత మొదలైన సెకండ్ హాఫ్ మొత్తం ఇల్లాజికల్ సీన్స్ తో సాగుతుంది. ఏ మాత్రం కనెక్ట్ కాని ప్రేమ సన్నివేశాలతో నింపేశాడు దర్శకుడు. తల్లిలాంటి ప్రేమను వెదుకుతున్న హీరోను కదిలించే అమ్మాయిగా నివేదను ప్రెజెంట్ చేయలేకపోయాడు. చివర్లో ఆ అమ్మాయి అతన్ని పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నా అని చెప్పడం పెద్ద ఎసెట్. దాన్ని చివర్లో పెట్టడం వల్ల ముందంతా సాగదీతగా కనిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినా.. దాన్ని ఎలివేట్ చేసే నిజమైన ప్రేమ కనిపించదు. దీంతో ఈ ప్రేమకథ పేలవంగా అనిపిస్తుంది. వాళ్లు విడిపోతున్నారని తెలిసినా ప్రేక్షకుడికి ఏమంత ఇబ్బంది అనిపించదు. అదే మైనస్. ఇక హీరోయిన్ ను చంపించేంత ప్రేమ, పగ ఆ విలన్ పాత్రకు ఎందుకు ఉన్నాయనేది పూర్తిగా నిర్లక్ష్యంగా రాసుకున్న సీన్స్.

కాకపోతే ఈ సినిమాలో కుర్రాళ్లకు ఎంగేజ్ చేసే కొన్ని సీన్స్ ఉన్నాయి. విశ్వక్ సేన్ టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్లే. అలాగని వాళ్లు కానీ ఆ రిపీటెడ్ సీన్స్ నుంచి డీవియేట్ అయ్యారా ఇంక పాగల్ కు కష్టాలు తప్పవు.

ప్రేమ్ పాత్రలో విశ్వక్ సేన్ ఎనర్జిటిట్ గా నటించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశాడు. నివేదా పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుంది. తనూ బాగా నటించింది. మిగిలిన మూడు ప్రేమకథల్లోని అమ్మాయిలు కూడా 'బావున్నారు'. అతని ఫ్రెండ్స్ గా నటించిన వారి నుంచి కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తే తప్పు మనదే. మురళీశర్మ స్థాయికి తగ్గ పాత్ర కాదిది. భూమిక ఉన్న కాసేపూ ఆకట్టుకుంటుంది.

టెక్నికల్ గా సినిమాకు పెద్ద ఎసెట్ సినిమాటోగ్రఫీ. చాలా రిచ్ గా ఉంది. తర్వాత మ్యూజిక్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బావుంది. ఎడిటింగ్ పరంగా ప్రేమకథల్లోనూ, ఆ తర్వాత వచ్చే పిట్టగోడ బ్యాచ్ సన్నివేశాల్లోనూ ఎన్ని కటింగ్స్ పడినా ఇబ్బంది లేదు. అయితే ఎడిటింగ్ విషయంలో తప్పు పూర్తిగా దర్శకుడిదే అవుతుంది తప్ప ఎడిటర్ ది కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

ఫైనల్ గా : అతను పాగల్ కాదు

Tags

Read MoreRead Less
Next Story