ఎట్టకేలకు అమృత్‌పాల్‌సింగ్‌ చిక్కాడు

ఎట్టకేలకు అమృత్‌పాల్‌సింగ్‌ చిక్కాడు
ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా జిల్లాలో అరెస్టు చేశారు

ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో అమృత్‌ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులకుపైగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఎట్టకేలకు చిక్కాడు. అరెస్టు కావడానికి ముందు అమృత్‌పాల్‌ మోగా జిల్లాలోని రోడె గ్రామంలోని ఓ గురుద్వారాలో ప్రసంగించినట్లు గుర్తించారు. ఇది ముగింపు ఏ మాత్రం కాదని అక్కడ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అమృత్‌పాల్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియో అరెస్టు అనంతరం వైరలైంది.

తన అరెస్టుతో ఉద్యమం ఆగిపోదని, ప్రారంభమవుతుందని అందులో పేర్కొన్నాడు. ఖలిస్థానీ వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే స్వగ్రామం రోడె కావడం గమనార్హం. అంతేకాదు.. గత ఏడాది అమృత్‌పాల్‌ ఇక్కడే వారిస్‌ పంజాబ్‌ దే అధినేతగా బాధ్యతలు చేపట్టాడు. అతడిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టారు. అరెస్టు చేశాక అమృత్‌పాల్‌ను బఠిండా వాయుసేన కేంద్రానికి, అక్కడి నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు. ప్రస్తుతం అదే జైల్లో అతడి అనుచరులు 9 మంది ఉన్నారు. వాస్తవానికి అమృత్‌పాల్‌ ఈ నెల 14వ తేదీనే తల్వండిలోని దమ్‌దమ్‌ సాహిబ్‌వద్ద పోలీసులకు లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. అక్కడ పోలీసులు భారీగా మోహరించడంతో వెనక్కి తగ్గాడు. మరోవైపు స్వర్ణ దేవాలయం వద్ద పోలీసు బలగాలు అధికంగా ఉండటంతో అతడు రోడెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అమృత్‌ పాల్‌ అరెస్టుపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. పోలీసులు తామే అరెస్టు చేశామని చెబుతుండగా.. అతడే స్వయంగా సమాచారం ఇచ్చుకున్నాడని తెలుస్తోంది. ఇక అమృత్‌ పాల్‌ అరెస్టుతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, అకాల్‌తఖ్త్‌తోపాటు అతని స్వగ్రామం జల్లపూర్‌ ఖేడాలో బందోబస్తును పెంచారు. ఎటువంటి వదంతులకు తావివ్వకుండా అమృత్‌ పాల్‌ అరెస్టును పంజాబ్‌ పోలీసులే ట్విటర్‌లో ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story