Rajasthan: కోటాలో ఉసురు తీసుకున్న రాంచీ బాలిక

Rajasthan: కోటాలో ఉసురు తీసుకున్న రాంచీ బాలిక
ఈ ఏడాది 25వ కేసు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఉసురు తీసుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25కు పెరిగింది. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్నరాంచీకి చెందిన 16 ఏళ్ల బాలిక తాజాగా ఉరివేసుకుంది.ఆమె నగరంలోని బ్లేజ్ హాస్టల్‌లో ఉంటూ నీట్‌కు శిక్షణ పొందుతోంది.

చదువుల వల్ల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలను నేరవేర్చలేమో అనే దిగులుతో చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో ఇప్పటికే చాలా మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక రాజస్థాన్ జిల్లాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.


మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రిచా సిన్హా మృతి చెందినట్లు ఆమెను తీసుకెళ్లిన ప్రైవేట్ ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందిందని విజ్ఞాన్ నగర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఆమె గదిలోంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపరుస్తోంది. నీట్ పరీక్షలో అర్హత సాధించాలని ఏటా దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులు కోటాకు కోచింగ్ కోసం వస్తారు. రాజస్థాన్ పోలీసులు ప్రకారం ఆత్మహత్యలను పరిశీలిస్తే 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2020, 2021లో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు. కోవిడ్ కారణంగా ఈ రెండేళ్లు కోటాలోని అన్ని కోచింగ్ సెంటర్లు మూసేయడంతో ఆత్మహత్యలు జరగలేదు. ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న కారణంగా కోటాలోని హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్లకు స్ప్రింగ్స్ బిగించారు. పెయింగ్ గెస్ట్ వసతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మహత్యలను నిరోధించేందుకు పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గించేలా మద్దతు ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు సిఫారసులు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని జరుగుతున్నా మరో ఆత్మా హత్య జరగడం అందరినీ ఆశ్చర్య పరచడమే కాదు ఆందోళన పరుస్తోంది కూడా.

Tags

Read MoreRead Less
Next Story