Bengaluru Water Crisis: నీటి వృథాపై బెంగళూరు వాటర్‌ బోర్డు కఠిన నిర్ణయం

Bengaluru Water Crisis: నీటి వృథాపై  బెంగళూరు వాటర్‌ బోర్డు కఠిన నిర్ణయం
22 కుటుంబాలకు రూ.1.1 లక్షల ఫైన్

బెంగళూరులో ఎండాకాలం గడుస్తున్న కొద్దీ నీటి సంక్షోభం కూడా ముదురుతున్నది. తాగేందుకు, ఇతర అవసరాలకు సరిపడా నీరు లేక నగరవాసు లు నానా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన నీటి కొరత నేపథ్యంలో తాగునీటిని వృథా చేయొద్దని సూచించిన బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బోర్డు(బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) అధికారులు.. తాజాగా తమ ఆదేశాలు ఉల్లంఘించారన్న కారణంతో నగరానికి చెందిన 22 కుటుంబాలపై రూ.5 వేల చొప్పున జరిమానా విధించి వసూలు చేశారు. తాగునీటిని వాహనాల వాషింగ్‌, గార్డెనింగ్‌ వంటి పనులకు ఉపయోగించినందుకు ఆయా కుటుంబాలపై జరిమానా వేసినట్టు వెల్లడించారు.

అనవసర పనులకు తాగు నీటిని వినియోగించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నీటిని వృథా చేస్తున్న వారిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బెంగళూరు నగర అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి నీటిని వృథా చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానాలు విధించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1.1 లక్షల ఫైన్ వేశారు. బెంగళూరు నగరాన్ని నీటి కొరత వేధిస్తున్న వేళ.. తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఆ 22 కుటుంబాలు అతిక్రమించాయని.. అందుకే ఫైన్లు వేసినట్లు బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు వెల్లడించింది. బెంగళూరు దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానాలు వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి అధికారులు.. బెంగళూరు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవి ఉద్ధృతంగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని బెంగళూరు వాసులు తీవ్ర బెంగలో ఉన్నారు.

నీటి ఎద్దడి కారణంగా హోలీ వేడుకల సందర్భంగా పూల్, రెయిన్ డ్యాన్సులు వంటి కార్యకలాపాలకు కావేరీ జలాలు, బోరు బావుల నీటిని ఉపయోగించడాన్ని బీడబ్ల్యూఎస్ఎస్బీ ఇటీవల నిషేధించింది.

ఈ కారణంగా చాలా కంపెనీలు తమ ప్రొగ్రామ్స్ ను రద్దు చేసుకున్నాయి కూడా. ఇక కుళాయిల నుంచి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏరేటర్లు ఇప్పుడు వాణిజ్య సంస్థలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్లు వంటి వివిధ ప్రదేశాల్లో తప్పనిసరి చేసింది. మరోవైపు నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా శుద్ధి చేసిన నీటిని పరిశీలిస్తోంది. అయితే కొన్ని కుటుంబాలు నీటిని వేస్ట్ చేయడంతో జరిమానా కట్టాల్సి వచ్చింది.


Tags

Read MoreRead Less
Next Story