Odisha Train Accident: ఇప్పటికీ గుర్తు పట్టని మృతదేహాలు 28

Odisha Train Accident: ఇప్పటికీ గుర్తు పట్టని మృతదేహాలు 28
ఇంకా జాగ్రత్త చెయ్యాలేమంటున్నభువనేశ్వర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు

ఒడిశా లో ఘోర రైలు దుర్ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలు ఎవరివో తెలియరాలేదు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి సంబంధీకులెవరూ ముందుకు రాలేదని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ దిలీప్‌ పరిడా వెల్లడించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచామని, ఇంకా మరి కొద్దిరోజులు మాత్రమే వాటిని భద్రపరిచే వీలుందన్నారు. ఇప్పటిదాకా దిల్లీలోని సెంట్రల్‌ ఫోర్సెనిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ సాయంతో డీఎన్‌ఏ క్రాస్‌ మ్యాచింగ్‌ ద్వారా మృతదేహాలను వాటి హక్కుదారులకు అప్పగించామని, క్లెయిమ్‌ చేసుకోని మృతదేహాలను ఏం చేయాలనే విషయంపై రైల్వేశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు . కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జూన్‌ 2న పరస్పరం ఢీకొట్టడంతో పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో దాదాపు 295 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మందికిపైగా గాయపడ్డారు. బోగీల మధ్య చిక్కుకున్న మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేకుండా మారాయి. దీంతో వాటిని గుర్తించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా 28 మృతదేహాలను గుర్తించలేకపోయారు.


మరోవైపు ఈ రైలు ప్రమాద ఘటనపై విచారణ జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ తాజాగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసి విచారణ జరిపిన సీబీఐ వారిపై ఈ ఛార్జ్‌షీట్‌లో నేరాభియోగాలు మోపింది. రైల్వే చట్టంలోని 153 సెక్షన్‌తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన అభియోగాలను వారిపై నమోదు చేసింది. రైలు ప్రమాద ఘటనలో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలతో విచారణ జరిపేందుకు రంగంలోకి దిగిన సీబీఐ.. జులై 7న సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ అరుణ్‌కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజనీర్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది.


ప్రమాదం జరిగిన బహనాగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో 94 వ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంత సమక్షంలోనే జరిగాయని సీబీఐ వెల్లడించింది. అయితే ఈ పనులకు 79 వ లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌కు సంబంధించిన సర్క్యూట్ రేఖా చిత్రాన్నే ఉపయోగించారని తెలిపింది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్‌ లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడమనేది.. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నాయనేది నిర్ధారించుకోవడం అరుణ్ కుమార్ మహంత పని అని.. అయితే ఆయన దాన్ని పట్టించుకోలేదని అని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story