Manipur : 3 నెలల్లో 30 మంది మిస్సింగ్

Manipur : 3 నెలల్లో 30 మంది మిస్సింగ్
అల్లర్లకు సంబంధించి సుమారు 6 వేల జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు

మణిపూర్‌లో హింస మొదలై 3 నెలలు అయ్యింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో విషయం స్థానికులను భయపెడుతోంది. రాష్ట్రంలో 3 నెలల్లో మొత్తం 30 మంది అదృశ్యమయ్యారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇంకా బయటకు రాని అనధికారిక సంఖ్య ఎంత ఉండచ్చు అనేది తెలియరాలేదు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు సంబంధించి బయటకు వస్తున్న విషయాలు అందరిని ఆందోళన పడేలా చేస్తున్నాయి. మొదట హింస, తరువాత మహిళల ఊరేగిపు సంఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. తాజాగా మరో భయంకరమైన విషయం బయటకు వచ్చింది. మణిపూర్‌‌లో మిస్సింగ్ కేసులు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 30 మంది అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. వీరంతా ఎక్కడికి వెళ్లారు. అసలు ఈ మిస్సింగ్ కేసులపై పోలీసులు ఏం చేస్తున్నారన్న దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మణిపూర్‌లో శాంతి భద్రతలను అదుపు చేయలేకపోయారని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మహిళపై అమానుష ఘటనలో మణిపూర్ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. మణిపూర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న మే 3 వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు మొత్తం 30 మంది జాడ కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. కనబడకుండా పోయిన వారిలో యువత నుంచి మధ్య వయసు ఉన్న వారు ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది.

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొన్ని రోజులకే సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అయిన 47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ కనిపించకుండా పోయారు. ఘటనలకు సంబంధించిన వార్తలు కవర్ చేసేందుకు సమరేంద్ర సింగ్.. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వెళ్లాడని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

పరిస్థితులు అదుపులోకి వచ్చాయని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జులై 6 వ తేదీన మణిపూర్‌లో కొన్ని ఆంక్షలను సడలించారు. కానీ ఆ తరువాత నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి వెళ్లిన 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ, ఆమె స్నేహితుడు కనపడకుండా పోయారు. అయితే వీరందరు మిస్సింగ్ కావడం వెనక ఒక్కో రికీ ఒక్కో కారణం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కరి జాడ కూడా కనుగొనలేకపోయారు.

Tags

Read MoreRead Less
Next Story