Ayodhya: 20 అర్చక పోస్టులు.. 3వేల దరఖాస్తులు

Ayodhya: 20 అర్చక పోస్టులు.. 3వేల దరఖాస్తులు
200 మందిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు

అయోధ్య రామ మందిరంలో విధులు నిర్వర్తించే అర్చకుల నియామక ప్రక్రియ జోరుగా సాగుతోంది. వేదాలు, సంబంధిత పూజా కార్యక్రమాలపై పట్టున్నవారిని ఇందుకోసం ఎంపిక చేసే పనిలో ఉంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. గుడిలో వివిధ పూజలు చేసేందుకు 20 నుంచి 30ఏళ్ల మధ్య వయసు ఉన్న 20 మంది అర్చకుల్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది ఆలయ ట్రస్ట్. 20 పోస్టుల ఖోసం 3వేల మందికిపై అర్చకులు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నారు.

అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మందిరంలో అర్చకుల ఉద్యోగాలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 3000 మంది దరఖాస్తు చేసుకోగా.. మెరిట్ ప్రాతిపదికన 200 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరికి అయోధ్యలోని కరసేవకపురంలో వృందావన్ ఆలయ పండితుడు జయకాంత్ మిశ్రా, అయోధ్యకు చెందిన మహంతులు మిథిలేశ్ నందిని శరణ్, సత్యనారాయణ్ దాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యులు కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

శిక్షణకు హాజరయ్యే ఎంపికకాని, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని, భవిష్యత్తులో సృష్టించే అర్చకుల పోస్టులకు పిలిచే అవకాశం ఉంటుందని రామమందిర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు పలు పూజా విధానాల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. సంధ్యావందనం విధానం, మంత్రాలు, ప్రత్యేక మంత్రాలతో పాటు కర్మకాండ, రాముడి ఆరాధన తదితర అంశాల గురించి అభ్యర్థులకున్న పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు దేవ్ గిరి చెప్పారు.

ఇక, మొత్తం 20 అభ్యర్థులను చివరకు ఎంపిక చేసి.. ఆరు నెలల పాటు రెసిడెన్షియల్ ట్రెయినింగ్ ఇస్తారు. అనంతరం రామజన్మభూమి ప్రాంగణంలోని వివిధ ఆలయాల్లో అర్చకులుగా నియమిస్తారు. ఎంపికైన 20 మంది అభ్యర్థులు విశ్వహిందూ పరిషత్ (VHP)తో సహా అనేక హిందూ సంస్థల కార్యాలయాలను కలిగి ఉన్న కరసేవకపురంలో ఆరు నెలల శిక్షణను నిర్వహిస్తారు. అగ్రశ్రేణి పండితులు తయారుచేసిన మతపరమైన సిలబస్ ఆధారంగా శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఒక్కొక్కరికి నెలవారీ స్టైఫండ్‌ కింద రూ.2,000 కూడా అందజేస్తారు.


Tags

Read MoreRead Less
Next Story