Panipuri: రోడ్డు పక్కన పానీపూరీ తిన్న తరువాత ..

Panipuri: రోడ్డు పక్కన పానీపూరీ తిన్న తరువాత ..
ఆస్పత్రిలో చేరిన 50 మంది

పానీ పూరీని ఇష్టపడని వారుండరు. ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తాయి. ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌ని చిన్న పిల్లల దగ్గర నుంచి.. పెద్ద వారి వరకూ అందరూ ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో గోల్గప్ప లేదా పానీపూరీ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు. పిలిచే పేర్లు, దీంట్లో వాడే పదార్ధాల్లో కాస్త తేడాలున్నా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్దికాలం క్రితమే చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

జార్ఖండ్ లోని కోడెర్మాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారి నుంచి పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగై 50 మంది అస్వస్థతలకు గురయ్యారని ఆరోగ్య అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా వద్ద పానిపూరీ తిన్నట్లు అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.

రోడ్డు పక్కన శాపలో పానీ పూరి తిన్న తర్వాత పిల్లలకు, మహిళలకు వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారని, వీరంతా బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బాధితులను కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. అందరినీ 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. వీళ్లలో చాలామంది పిల్లలు 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నవారే అని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నుంచి మిగిలిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం రాంచీకి పంపినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story