Uttarakhand Tunnel: కొనసాగుతున్న భారీ ఆప‌రేష‌న్‌

Uttarakhand Tunnel: కొనసాగుతున్న భారీ ఆప‌రేష‌న్‌
900ఎంఎం పైప్‌ల‌తో ట‌న్నెల్‌లో డ్రిల్‌

ఉత్త‌రాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల‌ను ర‌క్షించేందుకు రెస్క్కూ ఆప‌రేష‌న్ జోరుగా సాగుతోంది. వారికి ఆహారం, నీళ్లు అందిస్తున్నప్పటికీ వారిని బయటకు తీసుకురావటంలో మాత్రం ఇంకాఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్‌కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంతభాగం ఆదివారం కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 200 మీట‌ర్ల మేర ఆ శిథిలాలు ఉండటంతో గ‌త 48 గంట‌ల నుంచి కార్మికులు ఆ ట‌న్నెల్‌లోనే చిక్కుకుపోయారు. కార్మికుల వ‌ద్ద‌కు చేరుకునేందుకు ఎస్కేప్ మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. సుమారు 40 మీట‌ర్ల దూరంలో ఆ చిక్కుకున్న కార్మికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ట‌న్నెల్‌కు అడ్డంగా ఉన్న 21 మీట‌ర్ల శ్లాబ్‌ను తొల‌గించారు. ఇంకా 19 మీట‌ర్ల మార్గాన్ని క్లియ‌ర్ చేయాల్సి ఉంది.

ఇప్పటికే కార్మికులకు ఆహార పానీయాలు అందించామని పోలీసులు తెలిపారు. సొరంగం లోపల ఊడిపడుతున్న పెచ్చులను ఆపడానికి కాంక్రీట్‌ స్ప్రే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే 900 ఎంఎం వెడ‌ల్పు ఉన్న పైప్‌ల‌ను సొరంగంలోకి పంపేందుకు రెస్క్యూ బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. శిథిలాల వ‌ద్ద బోరు ద్వారా ఓ రంధ్రాన్ని వేసి, ఆ పైప్‌ల ద్వారా చిక్కుకున్న కార్మికుల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.


మెషీన్ ద్వారా డ్రిల్ చేసి.. ఆ రూట్లో పైప్‌ల‌ను ఆ సొరంగంలోకి చొప్పించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఈ ఆప‌రేష‌న్‌కు చెందిన అన్ని మెషీన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరిగేష‌న్ శాఖ‌కు చెందిన నిపుణులు కూడా ఈ ఆప‌రేష‌న్‌లో పాలుపంచుకుంటున్నారు.

కార్మికుల్లో బీహార్‌, జార్ఖండ్‌, యూపీ, బెంగాల్‌, ఒడిశా, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ శ‌ర‌ణార్థ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మ‌ఖాల్, య‌మునోత్రి జాతీయ హైవేపై సొరంగాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చిక్కుకున్న కార్మికులు బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్నార‌ని, ఆహారాన్ని, ఆక్సిజ‌న్‌ను అందిస్తున్నార‌ని, వాళ్లు న‌డిచేందుకు, శ్వాస పీల్చేందుకు 400 మీట‌ర్ల‌ ఏరియా ఉంద‌న్నారు. వాకీటాకీల ద్వారా మాట్లాడుతున్న‌ట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి.

సిల్క్యారా, దండల్ గావ్ లను కలిపేందుకు బ్రహ్మఖల్- యమునోత్రి నేషనల్ హైవేపై ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టింది. ఈ టన్నెల్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తరకాశీ నుంచి యమునోత్రి మధ్య దూరం 26 కిలోమీటర్లు తగ్గనుంది.

Tags

Read MoreRead Less
Next Story