Uttarakhand: త్వరలోనే టన్నెల్‌ నుంచి బయటికి రానున్న కార్మికులు..

Uttarakhand: త్వరలోనే టన్నెల్‌ నుంచి బయటికి రానున్న కార్మికులు..
14 మీటర్ల దూరంలో సహాయబృందాలు, 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం

ఉత్తరాఖండ్‌ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికాసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్న రెస్క్యూ బృందాలు.. కార్మికులకు అత్యంత చేరువలోకి వెళ్లాయి. కార్మికులు బయటకు రాగానే తక్షణ వైద్యం అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉత్తరకాశీలోని సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొంత సేపట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రకటించింది. తొలుత అమెరికన్‌ ఆగర్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ ద్వారా 800 మిల్లీ మీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లను 45 మీటర్ల మేర భూమిలోకి సమాంతరంగా ప్రవేశపెట్టారు. అప్పుడు కొన్ని స్టీల్‌ ముక్కలు పైప్‌లైన్‌కు అడ్డుపడ్డాయి. గ్యాస్‌ కట్టర్‌లతో కట్‌ చేసి మరో 12 మీటర్ల లోతుకు పైప్‌ను ప్రవేశపెడుతున్నారు.

నవంబర్‌ 12న ఈ సొరంగం ధ్వంసంకాగా 10 రోజుల నుంచి కార్మికులు అందులోనే ఉండిపోయారు. తమ వారి కోసం కూలీల బంధువులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురాగానే.. వారికి తక్షణ వైద్యం అందించేందుకు వైద్యసామాగ్రితో కూడిన బృందం ఘటనాస్థాలికి చేరుకుంది. వారిని వెంటనే తరలించి చికిత్స అందించేందుకు 41 బెడ్లతో కూడిన ప్రత్యేక ఆస్పత్రిని అధికారులు సిద్ధం చేశారు.

సహాయక చర్యల్లో ప్రస్తుతం 15 మంది పాల్గొంటున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ తెలిపింది. డ్రిల్లింగ్ పూర్తవగానే కార్మికులను తీసుకొచ్చేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ జవాన్లు కసరత్తులు కూడా నిర్వహించారు. స్ట్రెచర్లు, ఆక్సీజన్‌ కిట్లు తీసుకుని కార్మికుల వద్దకు చేరుకునేలా మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అటు.. ప్లాన్‌ బీలో భాగంగా.. బార్కోట్‌ నుంచి 8 మీటర్ల వరకు తవ్వకాలు చేశారు. ఇందుకోసం 3సార్లు పేలుళ్లు జరిపారు. సొరంగంలో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన వారిని విమానం ద్వారా తీసుకెళ్లాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బయటకు వచ్చిన వెంటనే ఎయిర్‌ లిఫ్ట్‌ ఆపరేషన్ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 15 మంది తమ పౌరులు సొరంగంలో చిక్కుకున్నట్లు ఝార్ఖండ్‌ తెలిపింది.


ఉత్తరకాశీ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని సొరంగాల భద్రతపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది. నిర్మాణంలో ఉన్న 29 సొరంగాలపై సేఫ్టీ ఆడిట్‌ను నిర్వహించనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

నవంబర్ 12 వ తేదీన సిల్క్యారా సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనతో అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలోని బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తర కాశీ సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సమాచారాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story