ADR REPORT: ఏపీలో 10 మంది ఎమ్మెల్యేలకు వంద కోట్ల ఆస్తి

ADR REPORT: ఏపీలో 10 మంది ఎమ్మెల్యేలకు వంద కోట్ల ఆస్తి
దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు.. తెలంగాణలో 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు.... 88 ఎమ్మెల్యేలకు వంద కోట్ల ఆస్తి..

దేశంలోని 44శాతం మంది ఎమ్మెల్యేల(44% MLAs)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పని చేస్తున్న ప్రముఖ ఎన్జీవో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్(Association for Democratic Reforms) ADR, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌‍(National Election Watch) NEW సంస్థలు సంయుక్త నివేదికలో వెల్లడించాయి. 28 శాసనసభలు(28 state assemblies), రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని(2 Union territories) 4,033 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం 4,001 మంది ఎమ్మెల్యేల(44% MLAs) ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను ప్రకటించింది. ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాల్లో వారే ఈ విషయాలను పేర్కొన్నారని వెల్లడించింది.


పరిశీలించిన మొత్తం 4 వేల ఒక్క ఎమ్మెల్యేల్లో 11 వందల 36 మందిపై హత్య.... కిడ్నాప్‌ హత్యాయత్నం వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇది దాదాపు 28 శాతం. మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారని తెలిపింది. కేరళ(Kerala)లో 135 మంది ఎమ్మెల్యేల్లో 95 మంది అంటే 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక(ADR report) వెల్లడించింది. బీహార్‌లో 242 ఎమ్మెల్యేల్లో 161 మందిపై, ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేల్లో 44 మందిపై, మహారాష్ట్రలో 284 మంది ఎమ్మెల్యేల్లో 175 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.


తెలంగాణ(TELANGANA)లో 72 మంది ఎమ్మెల్యేలపై... తమిళనాడులో 134 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం 114 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వారిలో 14 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు ADR నివేదిక తేల్చింది. ఢిల్లీలో 70 మంది ఎమ్మెల్యేలలో 37 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండగా బిహార్‌లో 242 మంది ఎమ్మెల్యేలలో 122 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. తెలంగాణలో 118 మంది ఎమ్మెల్యేల్లో 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది.

ఎమ్మెల్యేల క్రిమినల్ రికార్డులతో పాటు ఆస్తులను కూడా ADR, NEW విశ్లేషించాయి. దేశంలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు 13.63 కోట్ల రూపాయలుగా గుర్తించారు. క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.11.45 కోట్లు కాగా క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తి 16.36 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి 64.39 కోట్ల రూపాయలు ఉండగా తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి 28.42 కోట్ల రూపాయలని ఏడీఆర్‌ పేర్కొంది. 4,001 మంది ఎమ్మెల్యేలలో 88 మంది వంద కోట్లకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారని తేలింది. కర్ణాటకలో 32 మంది ఎమ్మెల్యేలకు వంద కోట్లకుపైగా ఆస్తులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 10 మందికి వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ADR నివేదిక తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story