Coronavirus: కేరళలో జేఎన్.1 వేరియంట్​ తొలి మరణం

Coronavirus: కేరళలో  జేఎన్.1 వేరియంట్​ తొలి మరణం
ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి

కరోనా వైరస్‌ కధ ముగిసిందని లైట్‌ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN-1 అనే కొత్త సబ్‌ వేరియెంట్‌ భయం పుట్టిస్తుంటే, ఇంకోవైపు దేశంలో ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. అంతేగాదు, ఈ వైరస్‌ కాటుకు ఐదుగురు చనిపోయారు. ఈ ఐదుగురిలో నలుగురు కేరళకు చెందిన వారైతే, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. దేశంలో ఇప్పుడు 1701 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నిఖార్సయిన నిజం.

ప్రపంచాన్ని వణికించిన కరోనాను మనం ఒకరకంగా మరచిపోయాం. మాస్కులు, టీకాలు, జాగ్రత్తలు అన్నీ హుష్‌కాకి అయిపోయాయి. కానీ ఇంతలోనే JN-1 అనే కరోనా కొత్త సబ్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయింది. కేరళలో దీన్ని గుర్తించారు అనగానే ఒక్కసారిగా మళ్లీ కంగారు పుట్టింది. JN-1 అనే కొత్త సబ్‌ వేరియెంట్‌ను సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మనదేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది.


ఈనెల ఎనిమిదో తేదీన కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఇది సులభంగా సోకే సామర్థ్యం ఉన్న వ్యాధిగా కనపించడమే శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. దాంతోపాటు.. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ JN.1 సబ్‌వేరియంట్‌ను BA.2.86 వేరియంట్‌గా కూడా పిలుస్తారు. ఈ JN.1 సబ్ వేరియంట్ మొదటిసారిగా సెప్టెంబర్ 2023 లో అమెరికాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మనుషుల రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో సింగపూర్‌లో కూడా ఈ JN.1 సబ్ వేరియంట్‌ కేసును గుర్తించారు. ఓ భారత పర్యాటకుడిలో కూడా ఈ వైరస్‌ను కనుగొన్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను కనుగొన్నారు. అయితే ఆ తర్వాత దేశంలో మళ్లీ ఎక్కడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా కేరళలో వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

Tags

Read MoreRead Less
Next Story