Aeroplan: రన్‌వేపై జారి .. రెండు ముక్కలైంది

Aeroplan: రన్‌వేపై జారి .. రెండు ముక్కలైంది
విశాఖ-ముంబయి ప్రైవేటు జెట్ ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలు

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ప్రమాదం సంభవించింది. ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేటు జెట్ విమానం రన్‌వే పై జారి పక్కకు దూసుకెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వీఎస్ఆర్ వెంచర్స్ లీర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విమానం విశాఖపట్నం నుంచి ముంబయికి బయలుదేరింది. ముంబయిలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌వేపై జారి, పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్పగాయలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.


ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని డీజీసీఏ తెలిపింది. రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ రన్‌వేను కొద్దిసేపు మూసివేశారు.ఆ సమయంలో ముంబైలో దిగాల్సిన తమ 5 విమానాలను వేరే ఇతర ప్రాంతాలకు మళ్లించినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. మొదటి రెండు విమానాలను హైదరాబాద్‌కు మళ్లించగా, తర్వాతి మూడు విమానాలను గోవాకు పంపించారు. సహాయక చర్యల అనంతరం.. డీజీసీఏ, ఏటీసీ అనుమతితో రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు. మరోవైపు.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story