Jharkhand: స్పానిష్ బైక్ రైడర్ పై గ్యాంగ్ రేప్

Jharkhand: స్పానిష్ బైక్ రైడర్ పై గ్యాంగ్ రేప్
జార్ఖండ్‌లో సామూహిక లైంగికదాడి

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పర్యటన కోసం స్పెయిన్ నుంచి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. మన దేశ గొప్పతనాన్ని చాటుతూ ఇండియాని ఎక్స్ ప్లోర్ చేస్తున్న ఒక స్పానిష్ బైక్ రైడర్ పై ఒక గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. మార్చి 2 శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

స్పెయిన్ కు చెందిన ఈ జంట బైక్‌లపై ప్రపంచయాత్ర చేయాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. 63 దేశాలను చుట్టి రావాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 1.7 లక్షల కిలోమీటర్లు జర్నీ చేయాలని భావించారు. స్పెయిన్ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోని బీహార్ కు చేరుకుని, అక్కడి నుంచి నేపాల్ వెళ్లాలని అనుకున్నారు. కానీ, ఝార్ఖండ్‌లో వారు దుండగుల చేతికి చిక్కారు. బాధితురాలు తన భర్తతో కలిసి దుమ్కా మీదుగా భాగల్పూర్ కు బైక్ టూర్ కు వెళ్లింది. రాత్రి 12 గంటల సమయంలో హన్స్‌దిహా మార్కెట్‌ ముందు జన సంచారం లేని ప్రదేశంలో టెంట్ వేసుకుని నిద్రకు ఉపక్రమించింది. రాత్రిపూట రోడ్డు పక్కనే టెంట్ లో నిద్రిస్తున్న జంటపై దాడిచేసిన దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఇద్దరినీ తీవ్రంగా కొట్టి గాయపరిచారు. జనసంచారం లేకపోవడంతో ఆమెకు సహాయం కూడా దొరకలేదు. బాధితురాలు పోలీస్ పెట్రోల్ వ్యానుని ఆపి సహాయం కోరినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడి ఉన్న వారిని పోలీసులు వెంటనే ఆస్పత్రకి తరలించారు. వారిని ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచడమే కాకుండా.. మెజిస్ట్రేట్ ఎదుట వారి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు.

ఘటన జరిగిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ వేదికగా తమకు జరిగిన అన్యాయం గురించి ఆ జంట వీడియో రూపంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె ముఖం ఉబ్బి పోయి కనిపించింది. ముఖం నిండా గాయాలు ఉన్నాయి. తామిక బతుకుతామని అనుకోలేదని, దేవుడి దయ వల్లే బతికామని వీడియోలో ఆమె పేర్కొన్నారు. తమ బాధను వెళ్లగక్కుతూ వారు షేర్ చేసిన వీడియోను ఆ తర్వాత తొలగించారు. దర్యాప్తునకు భంగం కలుగుతుందన్న పోలీసుల విజ్ఞప్తితో ఆయన దానిని డిలీట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story