Delhi : ప్రధాని ఇంటి ముట్టడి..

Delhi :   ప్రధాని ఇంటి ముట్టడి..
ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు

ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోదీ నివాసానికి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాగా, ఆప్‌ ఆదోళనలకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు.. పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండానే ముందుగానే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెప్పారు. పోలీసులు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రధాని నివాసానికి వెళ్లే తుగ్లక్ రోడ్డు, సఫ్తర్‌గంజ్ రోడ్డు, కేమల్ అటుటర్ మార్గ్ లలో వాహనాలకు అనుమతి లేదని నిషేధాజ్ఞలు విధించారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ కూడా చేయడానికి అనుమతి లేదని చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఆప్‌ ఆదోళనల నేపథ్యంలో ఢిల్లీ వాహనదారులకు పోలసులు పలు సూచనలు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. తుగ్లక్‌ రోడ్డులో, సఫ్దర్‌గంజ్‌ రోడ్డు, కేమల్‌ అటటుర్‌ మార్గ్‌లో వాహనాలను నిలపడం గానీ, పార్కింగ్‌ చేయడానికి గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈ నెల 22న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు వారం రోజులపాటు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో తమ అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించనుంది. అదేవిధంగా కేజ్రీవాల్‌కు సంఘీభావం కూడగట్టేందుకు ఆప్‌ సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ నేతలు, కార్యకర్తలు సోమవారం తమ ప్రొఫైల్‌ చిత్రాలను మార్చారు. కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్‌ చిత్రాన్ని డిస్‌ప్లేలో పోస్ట్‌ చేశారు. మోదీ కా సబ్సే బడా దార్‌ కేజ్రీవాల్‌ (మోదీని అత్యంత భయపెట్టిన కేజ్రీవాల్‌) అనే శీర్షికను డిస్‌ప్లే కింద పోస్ట్‌ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఆప్‌ ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించింది.

Tags

Read MoreRead Less
Next Story