Up Cm Yogi: హమాస్‭కు మద్దతిచ్చే వారికి సీఎం యోగి హెచ్చరికలు

Up Cm Yogi: హమాస్‭కు మద్దతిచ్చే వారికి సీఎం యోగి హెచ్చరికలు
సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ముదురుతోంది. ఈ విషయం పై ప్రభుత్వం కూడా తన నిర్ణయం ప్రకటించింది. ఈ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంపై ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుందని, ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషన్ శక్తి చట్టంతో పాటు రాబోయే పండుగల సన్నాహాలకు సంబంధించి అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు, పోలీసు కమిషనర్‌లు/యూపీలోని సీనియర్ సూపరింటెండెంట్‌లు/పోలీసు సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంలోనే ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని ప్రస్తావించారు. అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వ్యాఖ్యానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. పోలీసు అధికారులందరూ ఈ విషయంపై తమ ప్రాంతంలోని వివిధ మత పెద్దలతో కమ్యూనికేట్ చేయాలని అన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత ప్రభుత్వ అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలను రాష్ట్రంలో అంగీకరించబోమని యోగి హెచ్చరించారు.


శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపుదాడులు చేసిన వెంటనే.. ఈ దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ దాడి బాధాకరమైన విషయమని, ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని స్వయంగా ప్రధాని మోదీ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు. అంతేకాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా తాము ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంలోనే దేశంలోని ప్రజలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు హమాస్, పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నారు.

దీనిపై అలీఘఢ్ నుంచి ఒక కేసు కూడా వచ్చింది. అక్కడి ఏఎంయూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సీఎం యోగి అధికారులతో సమావేశం నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంచాలని సీఎం యోగి అధికారులకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story