Aditya L1: సూర్యుడి ఫోటోలను పంపించిన ఆదిత్య ఎల్ 1

Aditya L1: సూర్యుడి ఫోటోలను పంపించిన ఆదిత్య ఎల్ 1
సరికొత్త శకానికి నాంది అంటున్న శాస్త్రవేత్తలు

సూర్యునిపై పరిశోధనల ఇస్రో తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ మరో ఘనత సాధించింది. ఉపగ్రహంలో అమర్చిన సోలార్ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్-సూట్‌ సూర్యుని గుండ్రని చిత్రాలను తీసింది. ఇస్రో వాటిని విడుదల చేసింది. అతినీల లోహిత తరంగ దైర్ఘ్యాల దగ్గర నుంచి.... సూర్యుని గుండ్రని చిత్రాలను తొలిసారి తీసినట్లు ఇస్రో పేర్కొంది. అందులో 2వందల నుంచి 4వందల నానోమీటర్ల తరంగదైర్ఘ్యాల నుంచి తీసిన చిత్రాలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. బానుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లోని క్లిష్టమైన వివరాలు తెలుసుకోవటానికి....ఈ చిత్రాలు ఉపకరిస్తాయని ఇస్రో ప్రకటించింది.


సూర్యుడి గుట్టు విప్పేందుకు, పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సూర్యుడి సమీపంలోకి చేరుకోకముందే తన పనిని ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఇప్పటికే కీలక సమాచారాన్ని భూమికి చేరవేసింది. ఇందులో భాగంగానే తాజాగా సూర్యుడి ఫోటోలను తీసి ఇస్రోకు పంపించింది. సూర్యుడికి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలను తీసి పంపించింది. అయితే సూర్యుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఈ ఫోటోలు ఉపయోగపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 200-400 నానోమీటర్ల తరంగధైర్ఘ్యంతో, అత్యంత తీక్షణశక్తిని కలిగి ఉండే ఈ కిరణాల్ని వెలువరిస్తున్న సూర్యుడి ఫొటోలు బయటకు రావటం ఇదే మొదటిసారి. అంతరిక్షంలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1)ను ఆదిత్య ఎల్‌-1 వచ్చే ఏడాది జనవరిలో చేరుకుంటుందని ఇస్రో అంచనావేస్తున్నది. శాటిలైట్‌ అక్కడ్నుంచి సూర్యుడి గురించి పరిశోధన చేయనున్నది.

సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 తన ప్రయాణంలో చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్-1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇటీవల ఇస్రో వెల్లడించింది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య-ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story