Kota Death: ఎఫైర్ల కారణంగానే ఆత్మహత్య -రాజస్థాన్ మంత్రి వ్యాఖ్య

Kota Death: ఎఫైర్ల కారణంగానే  ఆత్మహత్య -రాజస్థాన్ మంత్రి వ్యాఖ్య
ఆత్మహత్యలకు సంబంధించి ప్రతి కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని సూచన

ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు తగ్గడంలేదు. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్‌కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. ఎఫైర్లు, నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రుల ఒత్తిడి విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని చెప్పారు. ప్రతి కేసు విషయంలోనూ లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఝార్ఖండ్ బాలిక సూసైడ్ లెటర్ రాసి చనిపోయిందని, ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని పేర్కొ్న్నారు. మంగళవారం బాలిక తన గదిలో ఉరివేసుకున్న విషయాన్ని అక్కడి వారు గుర్తించారు. ఆమె నీట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాకు వచ్చింది.


ఇక ఈ సందర్భంలోనే బిహార్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయాన్ని కూడా ఉటంకించిన మంత్రి తాను మిగతా విద్యార్థుల కంటే బాగా చదవలేకపోతున్నానని వారి కంటే వెనుకబడి ఉన్నాననే కారణంతో ఆ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఎప్పుడూ మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి కారణంగా పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది కోటాలో నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కోచింగ్ కోసం వెళుతుంటారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2020-21 కాలంలో కరోనా కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సమయంలో ఎటువంటి ఆత్మహత్యలు లేకపోవడం గమనార్హం. కాగా, ఆత్మహత్యలు నిరోధించేందుకు విద్యార్థుల గదుల్లోని ఫ్యాన్లకు స్ప్రింగులు, బాల్కనీలకు మెష్ లు బిగించాలని, బిల్డింగ్ చుట్టూ వలలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కల్పించే వారికి ఆదేశాలు జారీ చేసింది.


అలాగే ప్రతి హాస్టల్ వార్డెన్ రాత్రి 11గంటల సమయంలో విద్యార్థుల గదుల తలుపులు తట్టి అంతా బాగానే ఉందా అని అడగాలని వార్డెన్లకు పోలీసులు సూచించారు. విద్యార్థుల్లో ఒత్తిడి, అసాధారణమైన స్థితి కనిపిస్తే వెంటనే చెప్పాలని ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థులపై కన్నేసి ఉంచేందుకు"దర్వాజే పె దస్తక్‌" పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు.


Tags

Read MoreRead Less
Next Story